హయత్‌నగర్ రూరల్, ఏప్రిల్ 17:జీవితంలో అడుగడుగునా ఎన్నో చేదు అనుభవాలు.. అడుగులు ముందుకు పడటమే గగనమనేలా సంక్లిష్ట పరిస్థితులు.. ఇక మరణమే దిక్కేమో అన్నట్టు చూసే ఇరుగుపొరుగు కండ్లు.. ఎన్నో కష్టాలు, మరెన్నో ఆటుపోట్లు వీటన్నింటికీ పరిష్కారం చూపింది శ్రీమత్ భగవద్గీత. అదే గోవర్ధనం గోశాల ఏర్పాటుకు దారి చూపింది. పదిమందికి ఉపాధి తెచ్చిపెట్టింది. ఎంతోమందికి గోఆధారిత ఔషధాలను అందజేస్తున్నది. గోవు అంటే ఆర్థిక చేయూత కూడా కావాలని నిరూపిస్తూ మోడల్‌గా నిలుస్తున్నది.
హైదరాబాద్‌లోని ఆర్కేపురానికి చెందిన బంధా లక్ష్మణశర్మ 1999లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. అప్పుడే వివాహం జరిగింది. కానీ, అతడికి పెండ్లయిన మూడు నెలలకే నరాలకు సంబంధించిన (ఆటో ఇమ్యూన్ డిసీస్ : ఇమ్యూన్ సిస్టం మన ఆరోగ్యంపైనే దాడి చేయడం) వ్యాధి సోకింది. కనీసం నడవడం కూడా కష్టంగా మారింది. పది అడుగులు వేసేందుకు ఎన్నో నిమిషాలు పట్టేది.. చింతించలేదు. అప్పుడే భగవద్గీత చదివారు. అన్ని సమస్యలకు గీత పరిష్కారం అని గ్రహించారు. గురువు అయిన బొంబాయి ఐఐటీ ప్రొఫెసర్ రామ సుబ్రహ్మణ్యం సూచనలతో రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ తట్టిఖానాలో గోవర్ధనం గోశాలను ఏర్పాటు చేశారు. స్నేహితుడు తెల్ల నిలయ్ తేజ్‌తో కలిసి గోశాల నిర్వహణ చూసుకుంటున్నారు.
అడుగులు పడ్డాయి ఇలా..
వ్యాధి కారణంగా లక్ష్మణశర్మ తక్కువ దూరం నడిచేందుకు కూడా ఎక్కువ సమయం తీసుకునేవారు. నెమ్మదిగా కోలుకుంటూనే తాను చదివిన భగవద్గీత నుంచి నేర్చుకున్న పాఠాలను కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థులకు ఉచితంగా లాజికల్ క్లాసులను తీసుకోవడం ప్రారంభించారు. ఆరోగ్యధాం పేరుతో వెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు మెడిటేషన్ క్లాసులు తీసుకున్నారు. 12 ఏండ్లపాటు క్లాసులు తీసుకుంటూ మరింత నైపుణ్యం సాధించారు. ఇప్పటివరకు లక్షమందికిపైగా విద్యార్థులకు ప్రేరణ తరగతులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్‌లోని ఓ గోశాలకు వెళ్లారు.. అక్కడి నిర్వాహకులు పంచగవ్య మెడిసిన్ గురించి చెప్పడంతో పంచగవ్య థెరపీ నేర్చుకున్నారు. పంచగవ్యపై కోర్సు కూడా చేశారు. అక్కడ కలిసిన కొంతమంది గోశాల ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. తట్టిఖానాలో ఒకటిరెండు ఆవులతో గోవర్ధనం గోశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంఖ్య ఇప్పుడు 75 ఆవులకు చేరింది.
గో ఆధారిత ఔషధాల తయారీ..
లక్ష్మణశర్మ గోఆధారిత ఔషధాల తయారీపై దృష్టి పెట్టారు. నెమ్మదిగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. జనాలకు సైతం వాటిపై నమ్మకం ఏర్పడింది. నెయ్యి, గోమూత్రం, పేడ తదితరాలతో తయారుచేసే ఔషధాలు వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. పేడతో భస్మం తయారుచేయిస్తున్నారు. ఆవుపేడ నుంచి అగర్బత్తీలు, ధూప్స్టిక్లను రూపొందిస్తున్నారు. పాలు, పేడ, గోమూత్రం ఇలా అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నారు.
నెయ్యి.. మెడికల్ కిట్లు..
గోవర్ధనం గోశాలలో స్వచ్ఛమైన నెయ్యిని తయారుచేస్తున్నారు. గోమూత్రం ప్లాంట్ ఏర్పాటుచేశారు. గోమూత్రంతో డయాబెటిక్ కిట్లు, బీపీ కిట్లు, క్యాన్సర్ కిట్ తదితరాల తయారు చేస్తున్నారు. విభూతి (భస్మం) ఒక్కటే వేరే గోశాలలో సిద్ధం చేస్తున్నారు. పనీర్ సైతం ఇక్కడే తయారుచేస్తున్నారు. గోమూత్రంతో ట్యాబ్లెట్లను కూడా తయారుచేస్తున్నారు. ప్రస్తుతం గోశాలలోని ఆవులు 50 లీటర్ల పాలు ఇస్తున్నాయి. దాదాపు 20కిపైగా లీటర్లతో నెయ్యి, ఇతర పదార్థాలు తయారుచేస్తున్నారు. గోవులకు అవసరమైన గడ్డిని పండించేందుకు ఎలాంటి రసాయనాలు వినియోగించరు. ఆర్గానిక్గానే పండిస్తారు. దాన్నే గోవులకు వేస్తారు.
గోసేవలో ఆనందం
భగవద్గీతే నాకు స్ఫూర్తి. అదే అన్ని సమస్యలకు పరిష్కారం కూడా. ఇప్పటిదాకా నా జీవితంలో కనీసం 30 సెకన్లు కూడా ఎప్పుడూ చింతించలేదు. వేలకు వేలు ఆవులను పెంచాలనేది మా లక్ష్యం కాదు. ఆ ఉద్దేశమూ లేదు. అవసరం ఉన్నవారికి వ్యవసాయం చేసుకునేందుకు ఆవులు, ఎద్దులను ఉచితంగా ఇచ్చాం. చాలా సంతోషంగా ఉన్నాను. గో సేవలో ఎంతో ఆనందం ఉన్నది. ఆరోగ్యధాం పేరుతో సైకాలజీ సెంటర్‌ను ఏర్పాటుచేశా. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తుంటా. ఆయుర్వేదిక్ మందులు తయారుచేస్తుంటా.
– బంధా లక్ష్మణశర్మ, గోవర్ధనం గోశాల వ్యవస్థాపకుడు,ఆర్కేపురం, హైదరాబాద్
నా వంతు సహకారం అందిస్తున్నా..
గో సేవతో ప్రశాంతత దొరుకుతుంది. అందుకే గోశాలకు నా వంతు సహకారం అందిస్తున్నా. గోశాలను ఏర్పాటుచేసిన మొదట్లో నిర్వహణ భారం ఎక్కువ ఉండేది. కానీ, ఇప్పుడిప్పుడే దానికది సరిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఆవులను సంతోషంగా చూసుకోవడమే మా లక్ష్యం. ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు కూడా రెండింతలు వస్తాయి. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ముందుకెళ్తాం.
– తెల్ల నిలయ్తేజ్, చాదర్‌ఘాట్, హైదరాబాద్