ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 16: గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలను అందించేందుకు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలోని అన్ని సబ్ సెంటర్లలో ఈ-సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా సబ్‌సెంటర్లకు వైద్యం కోసం వచ్చే ప్రజలకు పీహెచ్‌సీలోని వైద్యులు ఆన్లైన్ ద్వారా రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలను అందించనున్నారు. సబ్‌సెంటర్ల నుంచి పీహెచ్‌సీలకు వెళ్లలేని వారికి ఈ-సంజీవిని కార్యక్రమం ఎంతో దోహదపడనున్నది. ఈ సందర్భం గా రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ సబ్సెంటర్లలో వైద్యాధికారుల కొరతతో ప్రజలకు మెరుగైన వైద్యం అందడం ఇబ్బందిగా మారడంతో సబ్‌సెంటర్లకు వచ్చిన రోగులకు ఏఎన్ఎంలు ఆన్లైన్ ద్వారా పీహెచ్సీలో ఉన్న వైద్యులతో నేరుగా మాట్లాడించి వారి సమస్యలను తెలుసుకుని అవసరమైన వైద్యాన్ని అందిస్తారని తెలిపారు. ఈ-సంజీవిని ద్వారా మెరుగైన వైద్యంతోపాటు యోగా, హెల్త్ న్యూట్రీషన్స్, బీపీ, షుగర్ తదితర వ్యాధులన్న వారికి కూడా వైద్య సేవలను అందిస్తారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఈ- సంజీవిని కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే, సబ్సెంటర్లలోఉన్న ఏఎన్ఎంలు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు మున్సిపాలిటీల్లోని సబ్‌సెంటర్లు, బస్తీ దవాఖానల్లోనూ ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.
18 నుంచి హెల్త్మేళాలు
అదేవిధంగా జిల్లాలోని పలు డివిజన్ల పరిధిలో అధికారులు హెల్త్ మేళాలను ఏర్పాటు చేస్తున్నా రు. ఈనెల 18వ తేదీన చేవెళ్లలో ఏర్పాటు చేయనున్న హెల్త్మేళాను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే 19న ఇబ్రహీంపట్నంలో, 20న సరూర్‌నగర్, ఫరూఖ్నగర్లలో, 21న రాజేంద్రనగర్‌లో, 22న కందుకూరులో వైద్యశిబిరాలు కొనసాగనున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఈనెల 19న ఏర్పా టు చేయనున్న డివిజన్‌స్థాయి హెల్త్మేళాను ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో నిర్వహిస్తున్నారు. ఉద యం 7నుంచి 12గంటల వరకు జరుగనున్నది. ఇందులో స్త్రీలు, ఇతర సంబంధిత వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధులు, గుండెసంబంధిత వ్యాధు లు, డెంటల్, ఆయుర్వేదం వంటి వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. హెల్త్మేళాలో వైద్యం చేయించుకున్న వారికి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద హెల్త్‌కార్డులను కూడా అందించనున్నారు. ఈ హెల్త్‌కార్డుల ద్వారా రూ.5 లక్షల వరకు పలు వ్యాధులకు చికిత్సలు పొందే సౌలభ్యం ఉంటుంది.
ఈ-సంజీవినిని సద్వినియోగం చేసుకోవాలి
ఈ-సంజీవిని కార్యక్రమాన్ని ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 19న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఏరియా దవాఖానలో ఏర్పాటు చేయను న్న హెల్త్మేళాలో రోగులు పాల్గొని వారి వ్యాధికి సంబంధించిన పలు సూచనలు, సలహాలను వైద్యుల ద్వారా పొందొచ్చు. ఇది గ్రామీణ ప్రాంత రోగులకు ఒక మంచి అవకాశం.
-కంబాలపల్లి ఉదయశ్రీ సర్పంచ్, నందివనపర్తి
18న చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో..
చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో సోమవారం ఉచిత హెల్త్మేళాను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్ తెలిపారు. ఈ మేళాలో 51 రకాల వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రా రంభం కానున్న శిబిరాన్ని చేవెళ్ల డివిజన్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు.