పరిగి, ఏప్రిల్ 13 : వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోలు, సంసిద్ధత, ఏర్పాట్లపై జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, కొనుగోలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. గన్నీ బ్యాగులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రం దాటి పోవద్దని స్పష్టం చేశారు. ప్రతి రైస్ మిల్లుకు, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక్కో బాధ్యత గల అధికారిని నియమించాలని సూచించారు. పొరుగు రాష్ర్టాల నుంచి అక్రమంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున గట్టి నిఘా పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి జిల్లాలో 167 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 7.36 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, 1.14 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ.. జిల్లాలో 41,215 మంది రైతుల నుంచి లక్షా18వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతు నుండి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. కేంద్రాల నిర్వహణకు అవసరమైన తేమ కొలిచే మీటర్లు, తూకం కాంటాలు, ప్యాడీ క్లీనర్లు అందిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, డీఆర్డీవో కృష్ణన్, వివిధ శాఖల అధికారులు, రంగారెడ్డి జిల్లా డీఎస్వో మనోహర్రాథోడ్, డీఎంవో శ్యామలక్ష్మి, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.