మంచాల, ఏప్రిల్ 13 : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. వివిధ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచాలలో 2,7 వార్డుల్లో, బోడకొండ 2వ వార్డు, కొర్రవాని తండా 6వ వార్డు, కాగజ్‌ఘట్ 8వ వార్డు, దాత్పల్లి 8వ వార్డు, తాళ్లపల్లి గూడ 5వ వార్డుతో పాటు ఆగపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓటరు జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 16వ తేదీ వరకు తెలియజేయాలని సూచించారు.
ముసాయిదా ఓటరు జాబితాపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 19వ తేదీ వరకు పరిష్కరించనున్నట్లు చెప్పారు. తుది ఓటరు జాబితా ఈనెల 21న మండల కేంద్రంలోని నోటీస్ బోర్డుపై ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కొందుర్గు : జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగనున్న వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఎంపీడీవో మహేశ్‌బాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని 21గ్రామాల్లో 91వార్డులకు ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన తెలిపారు. ఓటరు జాబితాల్లో సవరణలు ఉంటే ఈ నెల 16 వరకు అభ్యంతరాలను తెలుపాలన్నారు. సమావేశంలో ఎంపీవో విజయ్కుమార్పాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ నర్సింగరావు, అక్రమ్, జబ్బార్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : మండలంలోని మహాలింగపురం సర్పంచ్, టంగటూరు ఎంపీటీసీ, గోపులారం గ్రామ వార్డు మెంబర్ స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయని, అందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని ఎంపీడీవో వెంకయ్య కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశమై పంచాయతీల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీలలో ప్రదర్శనకు పెట్టామన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్ రవీందర్, మహాలింగపురం ఇన్చార్జి సర్పంచ్ మాణిక్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.