రంగారెడ్డి, ఏప్రిల్ 11, (నమస్తే తెలంగాణ) : బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి, స్త్రీ విద్య కోసం కృషి చేసిన జ్యోతిబాఫూలే అందరికీ ఆదర్శప్రాయుడని రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబా ఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదన్నారు. బాలికలు, మహిళలు చదువుకునేందుకు ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేయడంతోపాటు.. ప్రస్తుతం మహిళలందరికీ విద్యనందించడంలో కృషి చేసిన ఘనత జ్యోతిబాఫూలేది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి నీరజారెడ్డి పాల్గొన్నారు.
పరిగి, ఏప్రిల్ 11 : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, స్త్రీ విద్య కోసం పాటుపడిన జ్యోతిబాఫూలే అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ పేర్కొన్నారు. జ్యోతిబాఫూలే జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక డీపీఆర్సీ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శుభప్రద్‌పటేల్, వికారాబాద్ కలెక్టర్ నిఖిల జ్యోతిబాఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని తెలిపారు. సీఎం కేసీఆర్ సైతం ఫూలే ఆశయ సాధనకు వెనుకబడిన తరగతుల విద్యార్థుల అభ్యున్నతి కోసం 240 గురుకులాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని వికారాబాద్, తాండూరులలో బీసీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. జ్యోతిబాఫూలే విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. జ్యోతిబాఫూలే మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. ఆడపిల్లలందరూ బాగా చదివి అభివృద్ధి చెందాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా వివక్ష ఉంటే ధైర్యంగా ముందుకు సాగాలని, అసమానతలు లేని సమ సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎంపీపీ చంద్రకళ, బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఉపేందర్, మల్లేశం, కోటాజీ, వికారాబాద్ ఎంపీడీవో సత్తయ్య, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.