ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 9 : శ్రీరామ నవమికి ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. ఆలయాలను నిర్వాహకులు మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామాల్లో ప్రత్యేక కల్యాణ వేదికలను ఏర్పాటు చేశారు. మరోవైపు నేటి నుంచి పలు గ్రామాల్లోని ఆలయాల్లో జాతర షురూ కానున్నది.
సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రాములోరి ఆలయాల్లో సర్వం సిద్ధం చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో ఆలయాలు ముస్తాబయ్యాయి. పచ్చని తోరణాలు, పూల దండలతో అలంకరించగా, రాత్రి వేళలో విద్యుద్దీపాలతో ఆలయాలు జిగేల్మంటున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా పలు ఆలయాల్లో జాతరలు ప్రారంభం కానుండగా, కొన్ని ఆలయాల్లో శనివారం ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయాలకు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని సీతారాముల కల్యాణానికి ఆయా గ్రామాల్లోని ఆలయాలు ముస్తాబయ్యాయి. సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు ఆలయాలు రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పలు గ్రామాల్లో కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఈశ్వరాంజనేయస్వామి ఆలయం, మంచాల మండలంలోని ర
గాపూర్ సమీపంలోని గుడిబండ రాములోరి ఆలయం, నోముల గ్రామంలో సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగులూరు గ్రామంలో కౌన్సిలర్ అర్చన రాంరెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం, రాయపోల్, ఎలిమినేడు, శేరిగూడ, కప్పాడు, తుర్కగూడ, సీతారాంపేట్ గ్రామాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.