షాబాద్, ఏప్రిల్ 7: యువతను ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలు వంటి వాటికి బానిసలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచం మొత్తం ఇప్పుడిప్పుడే కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్నదన్నారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా నేటి యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులతోపాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా రాణించి తల్లిదండ్రులు, ఉపాధ్యా యులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ విజయరావు, రాష్ట్ర టీబీ నియంత్రణ మండలి ఐఈసీ ఆఫీసర్ జితేందర్, ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వెంకట్రావు, జిల్లా నెహ్రూ యువకేం ద్రం అధికారి ఐసయ్య, డీఆర్డీవో ప్రభాకర్, జేబీఐటీ విద్యార్థినీవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.