రంగారెడ్డి, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి వర్షాకాలంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బడంగ్‌పేట, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు, జల్పల్లి మున్సిపాలిటీలో చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని వరద ముంపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నాలా అభివృద్ధి కార్యక్రమం కోసం ప్రభు త్వం రూ.858.32 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.
భారీ వర్షాలతో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ఆమె సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.64కోట్లతో ఏడు పనులు, మీర్పేట్ ము న్సిపల్ కార్పొరేషన్లో రూ.23కోట్లతో రెండు పను లు, జల్పల్లి మున్సిపాలిటీలో రూ.10.5 కోట్లతో ఒక పనిని చేపట్టేందుకు నిధులను మంజూరు చేసినట్లు సబితారెడ్డి తెలిపారు. కాగా సదరు పనుల్లో ఆరు పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతోపాటు పనులను కూడా ప్రారంభించార ని, మిగిలిన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రి య పూర్తి కావాల్సి ఉందన్నారు. ఎస్ఎన్డీపీ పథకంలో భాగంగా చేపట్టనున్న పనులు వేగంగా పూర్తి అయ్యేందుకు జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో కలిసి సమష్టిగా ముందుకె ళ్లనున్నట్లు తెలిపారు.
సంబంధిత పనులు సకాలం లో పూర్తైతే వర్షాకాలంలో వరద ముంపు సమస్య పునరావృతం కాదన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్ఎన్డీపీ సూపరింటెండెంట్ ఇంజినీర్ భాస్కర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఎస్ఈ హైదర్‌ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కృష్ణ య్య, అనురాధ, కమిషనర్లు కృష్ణమోహన్ రెడ్డి, నాగేశ్వరరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.