తలకొండపల్లి, ఏప్రిల్ 4 : తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోగల లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఎల్లయ్యగౌడ్ దూపదీప నైవేద్యాల నిర్వాహకుడిగా ఉంటూ ఆలయంలోనే నివాసం ఉంటున్నాడు. ఆలయ పరిసరాల్లో గంజాయి మొక్కలను పెంచుతూ తన మేనల్లుడు శ్రీనివాస్‌గౌడ్ ద్వారా విక్రయిస్తున్నాడు. ఈ నెలలో ఆలయ బ్రహ్మోత్సవాలు ఉన్న నేపథ్యంలో గ్రామస్తులు ఆదివారం ఆలయ శుద్ధి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో అక్కడ కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గ్రామస్తులు వారిని నిలదీయగా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో కొంతమంది పారిపోతుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించే ప్రయత్నంలో శ్రీనివాస్‌గౌడ్ అక్కడికి చేరుకున్నాడు. వారిని పట్టుకున్నవారిలో ఒకరైన అంజయ్యను శ్రీనివాస్‌గౌడ్ కొట్టడమే కాకుండా దురుసుగా మాట్లాడాడు.
నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి కోసమే వారు వచ్చి ఉంటారనే అనుమానంతో కాపుకాయగా.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీనివాస్‌గౌడ్.. ఎల్లయ్యగౌడ్ నిల్వ ఉంచిన గంజాయి సంచిని బైక్‌పై ఇంటికి తరలిస్తుండగా పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శివశంకర వరప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి తరలిస్తున్న ఎల్లయ్యగౌడ్ను అరెస్టు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఉప తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లూస్‌టీంతో జరిగిన వార్తలను వీడియోల ద్వారా రికార్డు చేసి పంచనామా చేశారు. దొరికిన గంజాయిని తూకం వేయగా కిలో వంద గ్రాములు ఉన్నట్లు తెలిపారు. ఎల్లయ్యగౌడ్ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.