బషీరాబాద్, ఏప్రిల్ 3 : ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో గ్రామాల్లో ఉద్యోగ వేడి రాజుకున్నది. నిరుద్యోగులు, యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ ఉద్యోగం సంపాదించలేమనే కసితో చదువుల్లో నిమగ్నమైపోయారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని కొందరు, సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరికొందరు చదువులో తలమునకలయ్యారు. తల్లిదండ్రులకు తోడుగా ఉంటూనే కొందరు ఇంటి వద్దనే ఉంటూ చదువుకుంటుండగా, మరికొంతమంది ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లకు వెళ్లి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నారు. మండల పరిధిలోని ఎక్మాయి గ్రామంలో దాదాపు 60 మంది యువకులు వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలతో పాటు ఇతరత్రా పోటీ పరీక్షలు రాసేందుకు రాత్రింబవుళ్లు చదువుతున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనే యువకులు ప్రతి రోజు ఉదయం 4 గంటలకు లేచి రన్నింగ్, వ్యాయామం చేస్తున్నారు. టీచర్ ఉద్యోగాలు సంపాదించే యువకులు, నిరుద్యోగులు కంబైన్డ్ స్టడీ, ఆన్లైన్, సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. మరికొంతమంది పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ తీసుకొచ్చి ఇంటివద్దే చదువుతున్నారు. యువకుల ప్రిపరేషన్‌కు తల్లిదండ్రులు అవసరమైన సదుపాయాలు సమకూర్చి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని మేధావులు, గ్రామస్తులు యువకులను పోటీ పరీక్షలకు ప్రోత్సహిస్తున్నారు.
ఉచిత శిక్షణ భేష్
ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించడమే కాకుండా, ఉచితంగా వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదిస్తా. అంతేకాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు రాసే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఉండటం చాలా సంతోషం.
– రమేశ్, విద్యార్థి బషీరాబాద్ మండలం
ఎలాగైనా ఉద్యోగం సాధిస్తా
ప్రభుత్వం సరైన సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఇది నిరుద్యోగులకు పండుగ. కష్టపడి చదివి ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తా. గ్రంథాలయాల ద్వారా ప్రభుత్వం స్టడీ మెటీరియల్‌ను అందిస్తుండం గ్రామీణ నిరుద్యోగ యువతకు కలిసి వచ్చే అంశం.
– నరేష్, విద్యార్థి బషీరాబాద్