కొడంగల్, ఏప్రిల్ 3 : కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మివేంకటేశ్వరస్వామి ఆలయంలో 42వ బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి అంగరంగ వైభవంగా గరుడోత్సవం జరిగింది. గరుడ వాహనంపై ఆదిదేవుడు శ్రీమహావిష్ణువు అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చాడు. ప్రత్యేక పూజలు అందుకున్నాడు. అర్ధరాత్రి వరకు జాతర మైదానంలో భక్తులు ఆ దివ్యరూపాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా చెన్నై పట్టణానికి చెందినవారు ప్రత్యేకంగా పటాకులు తయారుచేశారు. దాదాపు గంటన్నరపాటు వివిధ ఆకారాల్లో పేలుతున్న పటాకులను చూసి భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగితేలారు. అనంతరం భక్తులను రంజింపజేసేలా వీధి నాటక ప్రదర్శన చేపట్టారు. జాతర స్థలం భక్తులతో కిటకిటలాడింది. రాత్రి రెండు గంటల వరకు భక్తులు స్వామి సన్నిధిలో గడిపారు. ఆదివారం ఉదయం స్వామివారు కలియుగ వరదుడు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో హనుమంత వాహనంపై కొలువుదీరి పూజలందుకున్నాడు. జాతర స్థలం వరకు ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కలిగించాడు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి వసంతోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల నుంచి వచ్చిన సిబ్బంది వివిధ రకాల పూలతో ఆస్థాన మండపాన్ని పూలతోట మాదిరిగా అలంకరించారు. శ్రీనివాసుడు భూదేవి, శ్రీదేవి సమేతుడై కొలువుదీరి భక్తులను కరుణించాడు.