రంగారెడ్డి, ఏప్రిల్ 2, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను 98 శాతం వసూలైంది. గతంలో మాదిరిగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీకి జూనియర్ కార్యదర్శులను నియమించింది. జిల్లాలో ఆస్తి పన్ను వసూలు లక్ష్యం రూ.26.72 కోట్లు కాగా.. 98 శాతం పన్ను, పన్నేతర పన్నులు వసూలయ్యాయి. వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పంచాయతీ శాఖ యంత్రాంగం జనవరి నుంచే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. రెండు, మూడేండ్లుగా ఆస్తి పన్ను చెల్లించకుండా బకాయిలున్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాకుండా ప్రతి గ్రామపంచాయతీలో సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలని ప్రచారం చేశారు. మరోవైపు జిల్లాలోని 16 మున్సిపాలిటీల్లోనూ లక్ష్యానికి మించి ఆస్తి పన్ను వసూలైంది. ప్రభుత్వం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకువస్తుండడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆస్తి పన్నును చెల్లించడం గమనార్హం.
రూ.24.22 కోట్ల ఆస్తి పన్ను వసూలు
జిల్లాలో ట్యాక్స్, నాన్ ట్యాక్స్‌లు కలిపి మొత్తం రూ.24.22 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. రూ.26.72 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 98 శాతం మేర ఆస్తి పన్ను వసూలు చేశారు. రూ.3 కోట్ల మేర బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల, మహేశ్వరం, మంచాల మండలాల్లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేశారు. మిగతా అన్ని మండలాల్లోనూ 95 శాతానికిపైగా ఆస్తిపన్ను వసూలు కావడం గమనార్హం.
పన్నుల వసూలులో రాష్ట్రంలో మూడో స్థానం
పరిగి, ఏప్రిల్ 2 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి నెల గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేస్తుండగా.. స్థానిక సంస్థలు ఆర్థిక బలోపేతంలో దోహదపడే పన్నుల వసూలులోనూ వికారాబాద్ జిల్లాలోని గ్రామపంచాయతీలు ముందు వరుసలో నిలబడ్డాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల పరిధిలో 566 గ్రామపంచాయతీలున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 వరకు వికారాబాద్ జిల్లా పరిధిలో పన్నుల విభాగంలో రూ.6,83,98,628, నాన్ ట్యాక్స్‌ల విభాగంలో రూ.57,54,714 మొత్తం రూ.7,41,53,342 వసూలయ్యాయి. పన్నుల విభాగంలో 99.45శాతం, నాన్ ట్యాక్స్‌ల విభాగంలో 89.51శాతం వసూలైనట్లు అధికారులు తెలిపారు. పన్నుల విభాగంలో జిల్లాలోని 15 మండలాల్లో వంద శాతం వసూళ్లు జరుగడం గమనార్హం. తద్వారా వికారాబాద్ జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పన్నుల వసూలులో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలోని దౌల్తాబాద్, పరిగి, పెద్దేముల్, నవాబుపేట్, కోట్‌పల్లి, కొడంగల్, బంట్వారం, పూడూరు, వికారాబాద్, దోమ, యాలాల, మర్పల్లి, మోమిన్‌పేట్, ధారూరు, బషీరాబాద్ మండలాల్లో వంద శాతం పన్నులు వసూలయ్యాయి.
ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వసూలు చేశాం : డీపీవో శ్రీనివాస్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లాలో ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి దాదాపు లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూలు చేశారు. అయితే ఆర్థిక సంవత్సరానికి మూడు నెలల ముందు నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేసేలా చర్యలు చేపట్టాం. కొందరు గత రెండేండ్లుగా బకాయిలు చెల్లించాల్సిన వారు మొండికేయడంతో మరో రూ.3కోట్లమేర పెండింగ్‌లో ఉంది. పెండింగ్ బకాయిలతోపాటు నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో మూడో స్థానం : ఎ.మల్లారెడ్డి, వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి
పన్నుల వసూళ్లలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వికారాబాద్ జిల్లా పరిధిలోని 566 గ్రామపంచాయతీల్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్‌లు కలిపి రూ.74153342 వసూలైంది. పన్నుల వసూలుతో గ్రామాల్లో అభివృద్ది పనులు చేసేందుకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. ఈ సంవత్సరం కూడా వంద శాతం పన్నుల వసూలు లక్ష్యంతో పనిచేస్తాం.