నందిగామ, ఏప్రిల్ 2 : గ్రామస్తులు కొన్నేండ్లుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న కలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. తమ గ్రామానికి రోడ్డు సక్రమంగా లేదని, గోతుల మయంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలుసుకున్నారు. అయ్యప్ప టెంపుల్ నుంచి జంగోనిగూడకు సీసీ రోడ్డును సీఆర్ఆర్ నిధులు రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు. జంగోనిగూడ నుంచి అంతిరెడ్డిగూడకు రూ.64 లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేయించారు. సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పూర్తి కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు పరిస్థితి ఇలా..
పాత జాతీయ రహదారి అయ్యప్ప టెంపుల్ నుంచి పృథ్వీ కాలనీ మీదుగా జంగోనిగూడ గ్రామానికి సుమారు 1.5 కిలో మీటర్ల దూరం ఉంది. ఈ రోడ్డులో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండటంతో రోడ్డు పూర్తిగా గోతుల మయంగా మారి వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డు పూర్తిగా గోతుల మయంగా మారడంతో వర్షకాలంలో వర్షపు నీరు ఆ గోతులలో నిండిపోవడంతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పాత జాతీయ రహదారికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా సక్రమమైన రోడ్లు లేకపోవడంతో గ్రామస్తులు ఎన్నో సార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఇటీవలే పనులు పూర్తి అయ్యాయి. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రోడ్డుతో ఎన్నో గ్రామాలకు మేలు..
పాత జాతీయ రహదారి నుంచి జంగోనిగూడకు రోడ్డు నిర్మాణం పనులు పూర్తికావడంతో పరిసర గ్రామాల ప్రజలకు సైతం ఎంతో మేలు జరుగుతుంది. అయ్యప్పటెంపుల్ నుంచి అంతిరెడ్డిగూడ, నర్సప్పగూడ ఇతర గ్రామాలకు వెళ్లే వారికి ఉపయోగంగా ఉంటుంది.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో..
మా గ్రామానికి రోడ్డు మంజూరు చేసి న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు కృతజ్ఞతలు. ఎంతో కాలంగా సక్రమంగా రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం రోడ్డు పనులు పూర్తికావడంతో మా గ్రామస్తుల సమస్య పరిష్కారమైంది. – శ్రీనివాస్‌యాదవ్, జంగోనిగూడ
రోడ్డు లేక ఇబ్బందులు పడే వాళ్లం..
అయ్యప్ప టెంపుల్ నుంచి మా గ్రామానికి రావడానికి రోడ్డు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే గోతులలో వర్షం నీరు నిండి ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రోడ్డు మంజూరు చేసి పనులు పూర్తి చేసినందుకు ఇబ్బందులు తప్పాయి. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు కృతజ్ఞతలు.
– సింధు, జంగోనిగూడ వార్డు సభ్యురాలు