రంగారెడ్డి, ఏప్రిల్ 1, (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎండలు ముదురుతున్నా భూగర్భజలాలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. పదిహేను రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో నీటి ప్రమాద ఘంటికలు ఏర్పడొచ్చని అధికారులు అంచనా వేసినప్పటికీ నీటి నిల్వలు మాత్రం పెద్దగా తగ్గకపోవడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే భూగర్భజలాలు పైపైనే ఉండడం గమనార్హం. గతేడాది మార్చి నెలాఖరు నాటికి జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు 10 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం రెండు మీటర్లపైనే నీటి నిల్వలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వరి సాగు తగ్గి ఇతర పంటల సాగు పెరగడంతోనే నీటి నిల్వలు నిలకడగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. వరి పంట సాగుకు అధిక నీటి వినియోగం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో వానాకాలంతో పోలిస్తే 50 వేల ఎకరాల వరకు వరి సాగు తగ్గడంతో నీటి వాడకం కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయింది. దీంతో జిల్లాలో సరాసరి భూగర్భజలాలు 8.60 మీటర్లపైనే ఉండడం సంతోషించదగిన విషయం. రానున్న ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు మరింత నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతీ ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
8.60 మీటర్లలోనే సరాసరి భూగర్భజలాలు..
జిల్లాలో సరాసరి భూగర్భజలాలు 8.60 మీటర్లలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే నీటి నిల్వల్లో మాత్రం పెద్దగా తగ్గకపోవడం గమనార్హం. వేసవి కాలం ఇంకా రెండు నెలలు ఉన్నది కాబట్టి జిల్లాలోని నాలుగైదు మండలాలు మినహా మిగతా మండలాల్లో పెద్దగా నీటి సమస్యలు ఏర్పడకపోవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని తలకొండపల్లి, ఫరూఖ్‌నగర్, చౌదరిగూడెం మండలాల్లోనే భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి ప్రమాద ఘంటికలు ఏర్పడే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది నమోదైన వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ భూగర్భజలాలు మాత్రం గతేడాదితో పోలిస్తే సుమారు 2 మీటర్లపైనే ఉండడం గమనార్హం. అయితే ఈ ఏడాది జూన్ నుంచి ఫిబ్రవరి వరకు సాధారణ వర్షపాతం 638.5 మి.మీటర్లు కాగా 901.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో భూగర్భజలాల పరిస్థితిని పరిశీలించినట్లయితే కేశంపేట మండలం ఇప్పలపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో కేవలం 3 మీటర్లలోనే భూగర్భజలాలు ఉన్నాయి.
అయితే ఎక్కువ అడుగంటిపోయిన భూగర్భజలాలకు సంబంధించి తలకొండపల్లి మండలం వెల్జల్లో 21.11 మీటర్ల లోతులో నీటి నిల్వలు ఉన్నాయి. జిల్లాలోని వివిధ మండలాల్లో భూగర్భజలాలను చూసినట్లయితే అబ్దుల్లాపూర్‌మెట్ కుంట్లూరులో 6.65 మీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 9.08 మీటర్లు, తుర్కయాంజాల్‌లో 6.20 మీటర్లు, ఆమన్‌గల్లులో 6.20 మీటర్లు, బాలాపూర్ మండలం నాదర్గుల్లో 8.04 మీటర్లు, చేవెళ్ల మండలం ఆలూర్‌లో 8.64 మీటర్లు, ధర్మసాగర్లో 13.68 మీటర్లు, కందవాడలో 9.96 మీటర్లు, చౌదరిగూడెం మండలంలోని వనంపల్లిలో 6.32 మీటర్లు, తుమ్మలపల్లిలో 17.51 మీటర్లు, వీరన్నపేట్లో 7.46 మీటర్లు, ఫరూఖ్‌నగర్ మండలంలోని షాద్‌నగర్‌లో 16.38 మీటర్లు, బూర్గులలో 4.96 మీటర్లు, గండిపేట మండలంలోని నార్సింగిలో 9 మీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడులో 8.43 మీటర్లు, కొంగరకాలన్‌లో 6.30 మీటర్లు, మంగల్‌పల్లిలో 6.37 మీటర్లు, దండుమైలారంలో 9.86 మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 15.46 మీటర్లు, కడ్తాల్ మండలంలోని కడ్తాల్‌లో 12.94 మీటర్లు, ముద్విన్‌లో 11.37 మీటర్లు, కందుకూరు మండలంలోని కందుకూరులో 6.93 మీటర్లు, మీర్ఖాన్పేట్లో 3.48 మీటర్లు, రాచలూర్లో 4.49 మీటర్లు, కొందుర్గు మండలంలోని ఇబ్రహీంపల్లిలో 6.30 మీటర్లు, కొత్తూరు మండలంలోని సిద్దాపూర్లో 6.50 మీటర్లు, మాడ్గుల మండలంలోని ఇర్విన్‌లో 4.73 మీటర్లు, మహేశ్వరం మండలంలోని మంకాల్‌లో 8.98 మీటర్లు, మంచాల మండలంలోని బోడకొండలో 3.83 మీటర్లు, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో 11.66 మీటర్లు, రాజేంద్రనగర్ మండలంలోని 10 మీటర్లు, శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లిలో 11.97 మీటర్లు, షాబాద్ మండలంలోని షాబాద్‌లో 9.38 మీటర్లు, శంషాబాద్ మండలంలోని మల్కారంలో 12.46 మీటర్లు, శంకర్పల్లి మండలంలోని మోకిలలో 15.73 మీటర్లు, యాచారం మండలంలోని నందివనపల్లిలో 3.13 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. అదేవిధంగా నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఎండిపోయిన బావులకు, బోరు బావులకు నీటిని మళ్లించడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం, చెక్‌డ్యాంలను, నీటి ఊట గుంతలను ఏర్పాటు చేసినట్లయితే భూగర్భజలాలు మరింత పెరిగే అవకాశాలుంటాయని అధికారులు సూచిస్తున్నారు.
నీటిని పొదుపుగా వాడుకొండి…
జిల్లాలో భూగర్భజలాలు గతంతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. తలకొండపల్లి, చౌదరిగూడెం, ఫరూఖ్‌నగర్ మండలాలు మినహా మిగతా మండలాల్లో నీటి నిల్వలు పైపైనే ఉన్నాయి. అయినప్పటికీ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టినట్లయితే భూగర్భజలాలు అడుగంటిపోయే పరిస్థితి రాకపోవచ్చు.
– రఘుపతిరెడ్డి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి