రంగారెడ్డి, ఏప్రిల్ 1, (నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థులకు తెలుగు సంవత్సరం కలిసిరానుంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించడంతోపాటు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకుగాను టెట్ నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 80,039 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రకటించగా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలు 1561 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మిగతా జోనల్, మల్టీ జోనల్‌కు సంబంధించిన పోస్టుల భర్తీల్లోనూ జిల్లా నిరుద్యోగాలు పోటీపడనున్నారు. జిల్లాలో ఖాళీగా పోస్టుల్లో విద్యాశాఖలో 705 పోస్టులు ఖాళీలున్నాయి. విద్యాశాఖలో ఉన్న పోస్టుల ఖాళీలకు సంబంధించి పదోన్నతుల ద్వారా 311 పోస్టులు ఖాళీలు ఏర్పడగా, ప్రత్యక్షంగా నియమకానికి సంబంధించి 394 పోస్టులు ఖాళీలున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. మిగతా శాఖల్లోని పోస్టుల ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. త్వరలోనే భర్తీకిగాను నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మరోవైపు పేద ఉద్యోగార్థులను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పలు ఉచిత కోచింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రంథాలయాల్లోనూ పోటీ పరీక్షలకు సంబంధించిన ఏ పుస్తకం కావాల్సిన ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేలా నియామకాలు..
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది నుంచి ఉద్యోగార్థులకు కలిసివచ్చే సంవత్సరంగా పేర్కొనవచ్చు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం ప్రారంభం కానుండగా తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగనామ సంవత్సరంగా చెప్పవచ్చు. ప్రభుత్వం 91వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలు చేపడుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేయనున్నది. వికారాబాద్ జిల్లా కేడర్ పోస్టులు 738, జోనల్ పోస్టులు 5297, మల్టీ జోనల్ పోస్టులు 6,370, గ్రూప్-1 పోస్టులు 503, గ్రూప్-2 పోస్టులు 582, గ్రూప్-3 పోస్టులు 1373, గ్రూప్-4 పోస్టులు 9168 ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ చేసే విధంగా ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపడుతున్నది. తద్వారా ఈ ఉగాది నుంచి ఉద్యోగార్థులందరూ ఉద్యోగాల సాధనలో నిమగ్నమై ఉండనున్నారు. ఇప్పటికే తాము ఎంచుకున్న, అర్హత పోస్టుల కోసం చదువడం ప్రారంభించారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో వికారాబాద్ జిల్లా పరిధిలో ఉచితంగా కోచింగ్‌కు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.
శిక్షణతోపాటు ఉచితంగా మెటీరియల్ అందజేత, మధ్యాహ్నం సమయంలో భోజనం సైతం ఏర్పాటు చేయనున్నారు. జిల్లా పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉచిత కోచింగ్‌తో నిరుద్యోగ యువతకు డబుల్ ధమాకా తగిలిందని పేర్కొనవచ్చు. ఉద్యోగాలకు అర్హత నిరుద్యోగులంతా ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఎంత ఖర్చవుతుందని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల నియామక ప్రకటన చేసిన మరుసటి రోజే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఉచితంగా కోచింగ్ సెంటర్లు అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు. ఈ నెలలోనే ఉచిత శిక్షణ సైతం ప్రారంభం కానున్నది. పేద ఉద్యోగార్థుల కోసం వారు కోరిన పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు గ్రంథాలయ సంస్థ నిర్ణయించింది.
జిల్లా పరిధిలో 18 గ్రంథాలయాలు ఉండగా వాటన్నింటిలో ఆన్ డిమాండ్ బుక్ రిజిస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు తమకు ఫలానా పుస్తకం అవసరమని అందులో రాస్తే వారం రోజుల్లో కొనుగోలు చేసి సంబంధిత గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ రూ.15లక్షలు ఖర్చు చేయనున్నది. మరో రూ.5లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నది. బుక్స్ ఆన్ డిమాండ్ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. మరోవైపు వికారాబాద్, తాండూరులో బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చక్కటి అవకాశాలు తాము నివాసముండే గ్రామాలు, పట్టణాల్లో అందుబాటులోకి వస్తున్న తరుణంలో నిరుద్యోగ యువత శిక్షణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయకుండానే, తమ ఇంటి దగ్గరే ఉంటూ ప్రిపేర్ కావడానికి చక్కటి అవకాశంగా పేర్కొనవచ్చు.
ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉద్యోగాల నియామకాలు చేపట్టనుండడంతో శ్రీ శుభకృత్ నామ సంవత్సరమంతా ఉద్యోగాలు సాధించే చక్కటి అవకాశం గల సంవత్సరంగా నిలిచిపోనుంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగాల బొనాంజాను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఇప్పటికే ఉద్యోగార్థులు ఉద్యోగ సాధనకు అవసరమైన విధంగా ప్రిపరేషన్లో ప్రస్తుతం నిమగ్నమయ్యారు. ఏదిఏమైనా ఈ సంవత్సరం నిరుద్యోగుల పాలిట ఉద్యోగాల కల్పన నామ సంవత్సరంగా నిలుస్తున్నది.