కులకచర్ల, ఏప్రిల్ 1 : మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అగ్ని గుండం కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పాంబండ దేవాలయం జన సంద్రంలా మారింది. శుక్రవారం తెల్లవారు జామున నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు దేవాలయానికి భక్తులు చేరుకుని పూజలు చేశారు. బ్రాహ్మణులు, శివసత్తులతో ఖడ్గాలు దింపుతూ.. ఓం నమఃశివాయ మహా మంత్రంతో భజనలు చేస్తూ అగ్నిగుండం తొక్కారు. గురువారం రాత్రి దేవాలయ ఈవో సుధాకర్, చైర్మన్ రాములు దేవాలయం ఆవరణలో భజనలు, కీర్తనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా కులకచర్ల ఎస్ఐ గిరి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దోమ, పరిగి, పూడూర్ పోలీస్స్టేషన్లకు చెందిన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తులు దర్శనానికి వెళ్లేందుకు క్యూలైన్లను ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతినిచ్చారు. జాతరలో తినుబండారాలు, చిన్న పిల్లల ఆటవస్తువులు కొనుగోలు చేస్తూ తమ కుటుంబ సభ్యులతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా పాంబండ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం ఉగాది పర్వదినంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.