రంగారెడ్డి, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి తన కార్యాలయంలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. బీజాపూర్ రహదారిపై ఇటీవల తరుచూ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగడం బాధాకరమని, ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి, సంబంధిత స్థలాల్లో ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా వేగ నియంత్రణ బోర్డులతోపాటు వాహనాల వేగాన్ని నియంత్రించేలా స్పీడ్ గన్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా మొయినాబాద్, చేవెళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు జంక్షన్లను అభివృద్ధి చేయాలని తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధికిగాను ప్రత్యేకంగా రూ.15 లక్షల నిధులను తాను మంజూరు చేసినట్లు వెల్లడించారు. జాతీయ రహదారి మధ్యలో ప్లాస్టిక్ బొల్లార్స్తోపాటు రోడ్డు అంచులను మట్టితో నింపాలని అధికారులకు సూచించారు. తక్కువ నిడివిగల కొన్ని ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. మరోవైపు కనకమామిడి నుంచి ముడిమ్యాల వరకు, బస్తేపూర్, మిర్జాగూడ గేట్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే సోమవారం నుంచే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, ట్రాఫిక్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ట్రాఫిక్ సేప్టీ నోడల్ అధికారి ఎల్సీ నాయక్, జాతీయ రహదారుల పీడీ కృష్ణప్రసాద్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసరావు, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్ పాల్గొన్నారు.