మంచాల, మార్చి 31 : పట్టణాలకు దీటుగా గిరిజన తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం నెలనెలా లక్షల రూపాయలు కేటాయించడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు గిరిజన తండాల్లో ఏ వీది చూసినా సరైన రోడ్లు లేకపోగా రోడ్లపైనే మురుగు నీరు చెత్తాచెదారం వలన నిత్యం దోమలు, ఈగలతో ప్రజలు సతమతమయ్యేవారు. కానీ నేడు సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం తండాలే అభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయలు కేటాయించడంతో సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీ, వీధిదీపాల ఏర్పాటు చేయడంతో పట్టణాలను తలదన్నే రీతిలో తండాలు మారాయి. మండల పరిధిలోని కొర్రవానితండా, సత్యంతండా, ఆంబోతుతండా, పటేల్చెర్వుతండా గ్రామపంచాయతీలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. తండాల్లో ప్రతి రోజు ఉదయాన్నే ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించడం హరితహారంలో నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం ప్రతి రోజూ మొక్కలకు నీరు పోయడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని నల్లా ద్వారా అందివ్వడంతో పాటు సమస్యలులేని తండాలుగా మారాయి. దీంతో తండాలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలకు నేరుగా నిధులు కేటాయించడంతో సమస్యలను ముందుగా గుర్తించి వాటిని పరిష్కరింపజేస్తున్నారు.
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
గిరిజన తండాలు హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎండాకాలం రావడంతో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరును పడుతున్నారు. తండాల్లో నాటిన ప్రతి మొక్కనూ రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్నారు.
సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాం..
గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను ముందుగానే గుర్తించి గ్రామపంచాయతీ సభ్యుల ఆమోదం మేరకు పనిచేస్తున్నాం. తండాల్లో గత ప్రభుత్వాల హయాంలో రోడ్లు, మురికి కాల్వలు లేక గిరిజనులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రతి వీధిన సీసీరోడ్లు, మురికి కాల్వలు, వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో సమస్యలను పరిష్కరించుకొని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచేందుకు పనిచేస్తున్నాం.
– లక్ష్మి, సర్పంచ్ కొర్రవాని తండా