ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 31 : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8గంటలు అయ్యిందంటే భానుడు భగభగ మండిపోతున్నాడు. ఈ ఎండల తీవ్రతకు మనుషులతో పాటు పశువులు కూడా వడదెబ్బ బారిన పడే ప్రమాదమున్నది. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలామస్ అనే భాగం స్వేదగ్రంధుల మీద పర్యవేక్షణ కోల్పోతుంది. దీనివల్ల అవి చెమటను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. చెమటద్వారా శరీరంలో ధాతువులు కోల్పోయి జీవక్రియ దెబ్బతింటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి శ్వాస, గుండె, నాడీమండలం, మూత్రపిండాల విధులు తగ్గిపోయి పశువుల ఆరోగ్యం విషమంగా మారి కోమాలోకి జారుకుంటాయని, శ్వాస అందక మరణిస్తాయని దీనికి రైతులు ఎప్పటికప్పుడు పశువులకు ఎలాంటి అపాయం జరుగకుండా ఎండలో జాగ్రత్తగా చూసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో పశువులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిదంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎండలు మండిపోతున్నందున రైతులు తమ మూగజీవాలను కాపాడుకునేందుకు సరైన జాగ్రత్తలు పాటించటంతో పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండుసార్లు నీటిలో శుభ్రం చేయాలని జిల్లా పశువైద్యాధికారి అంజిలప్ప తెలిపారు.
వడదెబ్బ లక్షణాలు..
పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 103డిగ్రీల సెల్సియస్ కంటే మించుతుంది. చర్మం మృదుత్వం తగ్గిపోయి గట్టిపడుతుంది. నోటితో గాలి పీల్చుకోవడం, నోటి వెంట చొంగకారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆవుల్లో పాల దిగుబడి, పునరుత్పత్తి, చూలుకట్టే శాతం తగ్గి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఎద్దుల్లో వంధ్యత్వం వస్తుంది. తీవ్రత ఎక్కువైనప్పుడు పక్షవాత లక్షణాలు సంభవించి క్రమంగా కోమాలోకి వెళ్తాయి.
వడదెబ్బ కారణాలు..
గాలిలో తేమ అధికంగా ఉండడం
వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగడం,
పాకలో సామర్థ్యానికి మించి పశువులు ఉండడం
నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు
వడగాలులు, పశువులు ఒత్తిడికి లోను కావడం వల్ల వడదెబ్బకు గురవుతాయి.
చికిత్స..
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్లు లేదా కూలర్ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయాల్లో పశువులను చల్లని నీటితో పలుమార్లు కడుగాలి. చల్లని నీరు తాగడానికి అందుబాటులో ఉంచి నొప్పులను తగ్గించడానికి నొప్పి నివారణ మందు (అనాల్జెసిక్) మందును వాడాలి. రక్తంలోకి డైక్ట్స్ట్రో స్లైన్, లవణ ద్రావణాలు ఎక్చించాలి.
నివారణ చర్యలు..
వేసవిలో పశువులను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మేతకు బయటకు వదలకూడదు. చల్లని నీరు తాగేందుకు పశువులకు అందుబాటులో ఉంచాలి. రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు చల్లని నీటితో కడుగాలి. లేదా నీటి చెరువులు, గుంతలున్న చోట నీళ్లలోకి వదలాలి. కొట్టాలను బాగా ఎత్తులో నిర్మించుకుని ఎండుగడ్డితో కప్పాలి. ఎండ ఉన్న సమయంలో దాని మీద నీల్లు చల్లుతుండాలి. ఇలా చేస్తే వడదెబ్బనుంచి పశువులను కాపాడుకోవచ్చును.
సరైన జాగ్రత్తలు పాటించాలి
వేసవి కాలంలో పశువులు ఎండల తీవ్రతకు తట్టుకోవు. ఎండలు విపరీతంగా కొడుతున్నందున వడదెబ్బకు గురై మృత్యువాత పడే అవకాశమున్నందున రైతులు పశువుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంకాలం వేళలో బయటకు వదలాలి. మధ్యాహ్నం పశువులను బయటకు వదలడం ద్వారా వడదెబ్బకు గురయ్యే అవకాశముంది. పశువులకు మధ్యాహ్నం వేళలో నీటిని అందుబాటులో ఉంచాలి. వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.
– అంజిలప్ప, జిల్లా పశువైద్యాధికారి