ఆమనగల్లు, మార్చి 31 : ఆరుగాలం శ్రమించే రైతు ల నుంచి యాసంగి వరిధాన్యాన్ని షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్ డిమాండ్ చేశారు. గురువారం ఆమనగల్లు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార ఉత్పత్తులను రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గుజరాత్, పంజాబ్ రాష్ర్టాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి, నరేందర్, జంగయ్యగౌడ్, లక్ష్మణ్, బాలకృష్ణ పాల్గొన్నారు.
ధాన్యాన్నికేంద్రం కొనుగోలు చేయాలి
శంకర్పల్లి : తెలంగాణ రాష్టంలో వరిధాన్యాన్ని కేంద్రమే తప్పని సరిగా కొనుగోలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో పాలక మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సిలర్లతో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మానం చేసిన ప్రతిని కమిషనర్ యాదగిరికి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాలను ఒకే విధంగా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సవతి తల్లి ప్రేమను కేంద్ర ప్రభుత్వం చూపడం తగదన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు ఎం.చంద్రమౌళి, శ్రీనాథ్, సంతోశ్, పార్శి రాధ, సంధ్యారాణి, వై.వాణి, కోఆప్షన్ సభ్యులు షబానాబేగం, రజని, వెంకట్రెడ్డి, మహమూద్ పాల్గొన్నారు.