రూ.12,500 కోట్ల రుణాల అందజేత
ఒక్క వికారాబాద్ జిల్లాలో బ్యాంకు ద్వారా రూ.359కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.62కోట్లు..
గర్భిణుల పౌష్టికాహారం కోసం జిల్లాకు ప్రత్యేక బడ్జెట్
10లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్..
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
కొడంగల్, తాండూరులో పర్యటన
కొడంగల్/బొంరాస్‌పేట, మార్చి 30: మహిళల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ చేయూతనందిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్, బొంరాస్‌పేట, తాండూరు మండలాల్లో ఆమె పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రుణం అందించి స్వయం ఉపాధి కల్పిస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.12,500 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు తెలిపారు. ఒక్క వికారాబాద్ జిల్లాలోనే బ్యాంకు ద్వారా రూ.359 కోట్లు, స్త్రీ నిధి ద్వారా రూ.62కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించడం కోసం వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధి కోసం 110 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల మంది లబ్ధి పొందారన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చే దిశగా సీఎం కేసీఆర్ అన్ని కులాల వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఒక ట్రాన్స్ఫార్మర్ కోసం వందల సార్లు అడిగే వారని నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
మహిళా అభున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి రూ.64లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనం, రూ.50లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ శిక్షణా కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానిక కేఎస్వీ ఫంక్షన్ హాల్లో మహిళలకు రుణాల చెక్కులు, సీలింగ్ ఫ్యాన్లు అందించారు. అలాగే బొంరాస్‌పేట మండలంలోని నాందార్‌పూర్ గ్రామంలో హంసాన్పల్లి నుంచి నాందార్‌పూర్ వయా చౌదర్పల్లి బీటీ రోడ్డును, రూ.1కోటి 72లక్షలతో నిర్మించిన బాపల్లితండా విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో స్త్రీలు వంటింటికే పరిమితం అన్నట్లుగా ఉండే వారని, నేడు కోట్లాది రుణాలను అందుకొని వ్యాపారాలతో ఆర్థికంగా ఎదుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బ్యాంకు ద్వారా రూ.12500 కోట్లు, స్త్రీ నిధి ద్వారా రూ.290కోట్ల రుణాలను అందించినట్లు తెలిపారు. ఒక్క వికారాబాద్ జిల్లా పరిధిలోనే బ్యాంకు ద్వారా మహిళలకు రూ.359కోట్లు, స్త్రీ నిధి కింద రూ.62కోట్లు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో జిల్లా పరిధిలో 2వేల మంది మహిళలు వ్యాపారాలు చేసుకొంటున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపారు.
రాష్ట్రం ఇప్పటి వరకు 10లక్షల మంది కల్యాణక్ష్మి, షాదీముబారక్ సాయం అందుకున్నారన్నారు. 1000 గురుకులాలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థిపై రూ.లక్షా 20వేలు వెచ్చించి కార్పొరేట్ తరహాల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రోడ్ల నిర్మాణం కోసం ఏడాదికి రూ.2 కోట్లు మంజూరయ్యేవని, నేడు సీఎం కేసీఆర్ కృషితో ఒక్క వికారాబాద్ జిల్లాలోనే ఈ ఏడాది రోడ్ల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళల వృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, పీడీ లలితకుమారి, జిల్లా లైబ్రెరియన్ సురేశ్‌బాబు, మెప్మా పీడీ కృష్ణ, జడ్పీటీసీలు అరుణాదేశు, కోట్ల మైపాల్, మహిళాసంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.
తాండూరులో ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటు కృషి
–స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సబితారెడ్డి
తాండూరు మార్చి 30: తాండూరు స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం రాత్రి తాండూరు పట్టణంలో ఘనంగా జరిగింది. అధ్యక్షుడు నయీం, ఉపాధ్యక్షులు కుంచం మురళీధర్, అబ్దుల్ సమద్, ప్రధాన కార్యదర్శి మిరాజ్ఫయాజ్, బ్రిజ్ మెహన్, షంషాద్ హుస్సేన్, కోశాధికారిగా సంజీవ్‌కుమార్ తమ పదవులకు న్యాయం చేస్తామని ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొన్న మంత్రి పి.సబితారెడ్డి మాట్లాడుతూ తాండూరులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో పాటు తాండూరు అభివృద్ధికి కావాల్సిన నిధులు అందిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరులోని కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు కార్మికులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నాపరాతి వ్యాపారుల సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ బైండ్ల విజయ్‌కుమార్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, కౌన్సిలర్లు, నాపరాతి వ్యాపారులు పాల్గొన్నారు.