దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
కొడంగల్ మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు
ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో కలిసి కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ
కొడంగల్, మార్చి 30: రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్ శ్రీ మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయ 42వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆయన స్థానిక ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ వరహాస్వామి దేవాలయ ప్రదేశంలో దేవాదాయ శాఖ నుంచి మంజూరై రూ.50లక్షలతో నిర్మించనున్న కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఆలయాలు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
తెలంగాణలో గోదావరి, ప్రాణహిత పుష్కరాలతోపాటు సమ్మక్క సారక్క జాతర, గ్రామాల్లో జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. యాదాద్రి నృసింహస్వామి దేవాలయాన్ని అన్ని హంగులతో పునర్నిర్మించినట్లు తెలిపారు. కొడంగల్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల తరహాలో పూజలు జరుగడం గర్వకారణమన్నారు. గతంలో ఆలయాల నిర్వహణకు రూ.2వేలు మాత్రమే అందేవని, నేడు దూపదీప నైవేద్యం పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.6వేల చొప్పున అందించడంతో పాటు అర్చకులకు వేతనం అందించి గౌరవిస్తున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 10వేల మంది అర్చకులకు జీవనోపాధి ఏర్పడిందని తెలిపారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని 42 ఆలయాల అభివృద్ధికి రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.4.20కోట్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. వేంకటేశ్వర స్వామి దేవాలయానికి నిధులు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలను వీరశైవలింగాయత్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానంచారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డితో పాటు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ నేతలు.
బొంరాస్‌పేట, మార్చి 30 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి బుధవారం టీఆర్ఎస్ నాయకులు మండలంలోని బుర్రితండా చెక్‌పోస్టు వద్ద ఘనంగా స్వాగతం పలికారు. కొడంగల్, కోస్గి మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న మంత్రికి పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, శ్రవణ్‌గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు ఖాజా మొయినుద్దీన్ తదితరులు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.