స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశం
ఒక్కరు లేదా గ్రూప్‌గా ఏర్పాటు చేసుకోవచ్చు
ఒక్కొక్క యూనిట్‌కు రూ.50లక్షల వరకు అంచనా వ్యయం
25శాతం లేదా గరిష్ఠంగా రూ.10లక్షలు సబ్సిడీ
పరిగి, మార్చి 30 : మహిళలు వ్యాపారాల్లో రాణించి ఆర్థిక ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో గ్రామాలతోపాటు మండలానికి ఒక మెగా ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహం అందిస్తున్నది. గతేడాది వికారాబాద్ జిల్లా పరిధిలో 2047 ఔట్లెట్స్ ఏర్పాటు కోసం రూ.లక్షలోపు రుణ సదుపాయం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.16కోట్ల రుణాలు ఇప్పించగా పలువురు మహిళలు ఆయా వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని రాణిస్తున్నారు. ఈసారి ప్రతి మండలానికి ఒక మెగా ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలో 19 మండలాలు ఉండగా.. మొత్తం 657 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. ఒక సంఘంగా లేదా స్వతంత్రంగా స్వయం సహాయక సంఘాల మహిళలు మెగా ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి రుణ సదుపాయం కల్పించడంతోపాటు సబ్సిడీ ఇప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.50లక్షల వరకు రుణం..
మెగా ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుపై ఆసక్తి ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళల వివరాలు, నిర్వహించే యూనిట్, తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రతి మండలానికి ఒకటి చొప్పున.. గ్రూపుగా లేదా ఒకరు సైతం మెగా ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల అంచనా వ్యయంతో యూనిట్‌ను నెలకొల్పుకోవచ్చు. సంబంధిత మండలం, గ్రామాల్లో ఏ యూనిట్ ఏర్పాటుచేస్తే వ్యాపారాభివృద్ధి జరుగుతుందనేది సొంతంగా మార్కెట్ సర్వే చేసినా, లేదా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది సూచనలతో ఏర్పాటు చేసినా సంబంధిత యూనిట్ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకుగాను బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ప్రధానంగా రైస్‌మిల్, దాల్మిల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ యూనిట్లు సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రాజెక్టు అంచనా ఆధారంగా రుణ సదుపాయం కల్పించనున్నారు. దీంతోపాటు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కింద ఒక్కో యూనిట్‌కు 25శాతం వరకు గరిష్ఠంగా రూ.10లక్షలు సబ్సిడీ సదుపాయం కల్పించనున్నారు. తద్వారా తాము ఎంపిక చేసిన యూనిట్‌ను చక్కగా నడుపుకొని ఆర్థిక ప్రగతి సాధించవచ్చు. యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి మండలాల్లో ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా మెగా ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో 3,285 విలేజ్ ఎంటర్ప్రైజెస్..
వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది 3,285 విలేజ్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించారు. ఒక్కో గ్రామ సమాఖ్య పరిధిలో 5 విలేజ్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు ఐదు మందిని ఎంపిక చేసి పంపించాలని అధికారులు సూచించారు. సంబంధిత లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారం ఏర్పాటుకు ఒక్కొక్కరికి రూ.2లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పిస్తారు. ప్రతి సమాఖ్య పరిధిలో ఐదుగురిని ఎంపిక చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 3,285 విలేజ్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు రూ.65.70కోట్లు రుణాలు ఇప్పించనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే వారికి రుణ సదుపాయం కల్పించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 2021-22లో జిల్లాలో 2,047 మందికి రూ.లక్ష లోపు రుణాలుగా రూ.16కోట్లు ఇప్పించగా.. వారందరూ వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. రుణాలను సైతం ప్రతినెలా సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈసారి ఏర్పాటు చేసే విలేజ్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఒక్కోదానికి రుణ పరిమితిని రూ.2లక్షలకు పెంచుతూ నిర్ణయించారు.
రుణం ఇప్పిస్తాం..
ప్రతి మండలానికి ఒక మెగా ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు నిర్ణయించాం. ఒక్కో యూనిట్‌కు రూ.50లక్షల వరకు అంచనా వ్యయంతో ముందుకెళ్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రూపుగా లేదా వ్యక్తిగతంగా వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తాం. వాటికి పీఎంఎఫ్ఎంఈ ద్వారా ఒక్కో యూనిట్‌కు 25శాతం, గరిష్టంగా రూ.10లక్షల వరకు సబ్సిడీ అందుతుంది. వీటితోపాటు జిల్లాలో ఈసారి 3,285 విలేజ్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయనున్నాం. ఒక్కోదానికి రూ.2లక్షల వరకు రుణం బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా ఇప్పిస్తాం.
–కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా