కరోనా విజృంభణ దృష్ట్యా గ్రామ పంచాయతీల నిర్ణయం
మొయినాబాద్, ఏప్రిల్16: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జిల్లాలోని పలుచోట్ల స్వచ్ఛంద లాక్డౌన్ చేపడుతున్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌లో నేటి నుంచి లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ విధించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు గ్రామంలో మైక్ ద్వారా దండోరా వేయించారు. దుకాణాదారులకు నోటీసులు కూడ ఇవ్వాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని, ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ బండ్లగూడెం సంధ్య తెలిపారు.
వెంకిర్యాలలో లాక్డౌన్
మండలంలోని వెంకిర్యాల గ్రామంలో 15రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు పంచాయతీ ప్రకటించింది. మూడు రోజుల్లో గ్రామ సర్పంచ్ లింగంతోపాటు దాదాపు 40మందికి కరోనా సోకింది. దీని దృష్ట్యా గ్రామంలోని వ్యాపార సముదాయాలు కేవలం ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటు తెరుచుకోవాలని పాలకులు, అధికారులు తెలిపారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించడంతో సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. గ్రామంలో ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు వీధులను శానిటైజేషన్ చేపట్టనున్నట్లు డాక్టర్ అమృత తెలిపారు.