రంగారెడ్డి, మార్చి 25, (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది. వడ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రజలు అడిగితే నూకలు తినిపించడం నేర్పించండంటూ అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై జిల్లా అంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఒకప్పుడు కరువు పరిస్థితులతో తెలంగాణ ప్రజలు నూకలు తిన్నారని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని, ప్రధానంగా వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యతతో సాగు విస్తీర్ణం పెరిగింది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 24 గంటల విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువులకు పూర్వవైభవం తీసుకురావడం, రైతుబంధు తదితర కార్యక్రమాలతోపాటు అన్నింటిలోనూ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగడంతో కరువుపోయి ప్రజలు, రైతాంగం ఆర్థికంగా వృద్ధి చెందారు.
ప్రస్తుతం తెలంగాణలో కరువుపోయి ఇతర రాష్ర్టాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగారని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సమృద్ధిగా చెరువులు, బోర్లలో నీరుండడంతో వరి సాగు కూడా పెరిగింది. వానకాలం సీజన్ నుంచి తెలంగాణలో పండించిన వడ్లను కొనమని కేంద్రం పేచీ పెట్టడంపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నీరుండడంతో పంట సాగు చేస్తున్నామని, పంట చేతికొచ్చే సమయానికి కేంద్రం చేతులెత్తేయడం సరైంది కాదని వాపోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు కేంద్రంపై ఉద్యమిస్తామన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఊరుకునేది లేదని జిల్లా ప్రజానీకం డిమాండ్ చేశారు.
అవమానకరంగా గోయల్ మాటలు
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరి మరోసారి బయటపడ్డది.. తాము బాయిల్డ్ రైస్ కొనమంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడంతోపాటు అవమానకరంగా, తెలంగాణ ప్రజల పట్ల హేళనగా మాట్లాడడాన్ని సమాజమంతా ఖండిస్తుంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యల పట్ల రైతులు, ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సర్కారు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పంటలు పండిస్తున్నారు. తద్వారా ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం సైతం సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నది. ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందజేయడం. వికారాబాద్ జిల్లాలో వానకాలంలో లక్షా 12వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సీఎం కేసీఆర్ సూచనతో ఈసారి యాసంగిలో 45వేల ఎకరాల్లోనే వరి సాగు చేపట్టారు. సంవత్సరం యాసంగిలో 75వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, ఈసారి సుమారు 30వేల ఎకరాలు తగ్గింది. ఇతర పంటల వైపు రైతులను మరల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉన్నది. కానీ పండించిన వరి ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండగా మొండివైఖరి అవలంభించడం తగదంటున్నారు.
పంజాబ్‌లో ఒకలా…తెలంగాణలో మరోలా..
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఒకే విధమైన విధానాన్ని అవలంబించాల్సిన కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌లో రెండు పంటలకు సంబంధించిన వడ్లు కొనుగోలు చేస్తూ తెలంగాణలో ఒకే పంటకు సంబంధించిన వడ్లు కొనుగోలు చేస్తామనడం సరికాదంటున్నారు. ప్రధానంగా యాసంగిలో పండించే వరి ధాన్యం పంట చేతికి వచ్చే సమయానికి ఉష్ణోగ్రతలు పెరుగడం ద్వారా గింజ గట్టిపడి రైస్‌మిల్లుకు వేస్తే అధికంగా నూకలు అవుతాయి. దీంతో బాయిల్డ్ రైస్మిస్లో వేయడం ద్వారా నూకలు కాకుండా బియ్యం వస్తాయి. బాయిల్డ్ రైస్‌మిల్లును కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పేచీలు పెట్టడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వడ్లు కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ర్టానికి చెందిన మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌ను కలవగా బాయిల్డ్ రైస్ కొనమని చెబుతూ తెలంగాణ ప్రజలు నూకలు తినండి అంటూ అవహేళనగా మాట్లాడడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కేంద్రం రైతులు పండించిన పంటల విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని రైతులు పేర్కొంటున్నారు.
బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
పంజాబ్ రాష్ర్టానికి చెందిన రైతులు పండించిన రెండు పంటలను కొనుగోలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు పండించిన వడ్లను మాత్రం కొనడం లేదు. షాపుల్లో అమ్ముడుపోయే దాన్నే మేం కొంటాం తప్ప తెలంగాణ ప్రజలు పండించిన వడ్లు, బాయిల్డ్ రైస్‌ను కొనమని కేంద్ర మంత్రి చెప్పడం విడ్డూరం. తెలంగాణ ప్రజలను హేళన చేస్తూ, అహంకారంగా మాట్లాడం సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.
– పొట్టిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, నాగులపల్లి, పెద్దేముల్ మండలం
అవగాహన లేని మంత్రి గోయల్
వ్యవ్యసాయంపై అవగాహన లేని మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమంటూ కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను అవమానించేలా, అహంకారపూరితమైన వ్యాఖ్యలు అత్యంత దారుణం. బియ్యం మొత్తం మీ రాష్ట్రమే కొనుగోలు చేసి, నూకలు తినడం మీ ప్రజలకు అలవాటు చేయండి అనడం చాలా బాధగా ఉంది. తెలంగాణ నుంచి బియ్యం మాత్రమే సేకరిస్తామని, ధాన్యం సేకరించబోమని చెప్పడం అవగాహన రహిత్యంగా ఉంది.
– మానస, రైతు, యెల్లకొండ, నవాబుపేట మండలం
ధాన్యాన్ని కొనాల్సిందే..
రైతులు పండించిన ధాన్యం ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే. ధాన్యాన్ని కేంద్రం కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే వారు మళ్లీ ధాన్యాన్ని ఎలా పండిస్తారు. అప్పుడు ధాన్యం కొరత ఏర్పడే పరిస్థితి ఉంటుందనే విషయం కేంద్ర మంత్రికి తెలియదా. తెలంగాణ ప్రజలను నూకలు తినటం అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి మాట్లాడడం సరికాదు.
– సామ రవీందర్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ షాద్‌నగర్
రైతులపట్ల కేంద్రం వైఖరి సమంజసం కాదు
తెలంగాణ రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదు. ప్రత్యేక రాష్ట్రంలోని బీడుభూములకు పుష్కలంగా రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు అందించటం ద్వార రైతులు పెద్ద ఎత్తున వరిధాన్యం పండిస్తున్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయమని అడుగుతుంటే మొహం చాటేసుకుంటూ, రాష్ట్రంలోని రైతులను కేంద్రం తీవ్రంగా నష్టపరుస్తున్నది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో పాటు అనుచిత వాఖ్యలు చేయటం సిగ్గుచేటు. కేంద్రం తమ వైఖరిని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఉధ్యమాలు ఉదృతం చేస్తాం.
– మధుసూదన్‌రెడ్డి, రైతుసంఘం జిల్లా నాయకులు (ఇబ్రహీంపట్నం)
అప్పటి పరిస్థితులు వేరు..
40 ఏండ్ల క్రితం మేము నూకలు తిన్నాం. అప్పుడు తెలంగాణలో కరువు ఉండేది. తిండి సరిగ్గా ఉండేది కాదు. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కడుపునిండా బువ్వ తింటున్నారు. ఇప్పుడు కూడా నూకలు తినండని అనడం మంచిగా లేదు. ఇప్పుడు నూకల బియ్యం తినాల్సిన అవసరం మాకు లేదు.
– సుమిత్ర, శంకర్పల్లి
నూకలు తినాల్సిన అవసరం మాకు లేదు
మా కాలంలో నూకలు తిన్నది నిజమే. కానీ ఇప్పుడేవరు తింటున్నారు. కేసీఆర్ దేశానికే అన్నంపెట్టే స్థాయిలో రైతాంగానికి పెద్దపీట వేస్తున్నారు. అప్పట్లో తిండికి తిప్పలు ఉండి నూకలు తినేవాళ్లం. ఇప్పుడు 24గంటల కరెంట్‌తో పంటలు పండించుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు ఇస్తుండు. ఇప్పుడు నూకలు తినే అవసరం మాకు లేదు.
– చంద్రయ్య, కమ్మెట, చేవెళ్ల మండలం