బొంరాస్‌పేట, మార్చి 25: వరిధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుస రిస్తున్న వైఖరి రైతుల పాలిట శాపంగా మారింది. యాసంగిలో పండించే వరిధాన్యాన్ని కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్రప్రభుత్వం అవగాహన కల్పించడంతో రైతులు ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణాన్ని బాగా తగ్గించారు. రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్ధతు ధరలను చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేసేది. ఈ విధానం వల్ల రైతులు తాము పండించిన ధాన్యాన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకునే వారు. మద్ధతు ధరల వల్ల పెట్టిన పెట్టుబడి పోగా రైతులకు లాభం మిగిలేది.
అయితే కేం ద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనబోమని గత ఏడాది ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటలపై అవగాహన కల్పించింది. దీంతో కొడంగల్ నియోజకవర్గం లోని రైతులు వరి సాగుకు మొగ్గు చూపలేదు. కొనుగోలు కేంద్రాలు లేకుంటే పండించే ధాన్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని భావించిన రైతులు చాలా గ్రామాల్లో వరిసాగుకు దూరంగా ఉన్నారు. గత ఏడాది వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాయి. చాలా గ్రామాల్లో వీటి కింద ఆయకట్టు బీడుగా ఉంది. వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం రైతులను కోరినా చెరువులు, కుంటల కింద ఉన్న మాగాణి భూములు వరి సాగుకు తప్ప ఇతర పంటల సాగుకు అనుకూలంగా ఉండవు. ఈ కారణంతో రైతులు వరిసాగుకు ముందుకు రాలేదు. కొంతమంది రైతులు ధైర్యం చేసి వచ్చిన ధరకు మార్కెట్లో అమ్ముకుందామని చెరువుల కింద, వ్యవసాయ బోర్ల కింద కొంత విస్తీర్ణంలో వరినాట్లు వేశారు.
మూడు మండలాల్లో 16 వేల ఎకరాల్లో వరిసాగు
కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ఈ ఏడాది యాసంగిలో రైతులు 16783 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. ఇది వానాకాలం సీజన్‌తో పోలిస్తే సగం. బొంరాస్‌పేట మండలంలో 7082 ఎకరాల్లో, దౌల్తాబాద్ మండలంలో 6390 ఎకరాల్లో కొడంగల్ మండలంలో 3311 ఎకరాలలో రైతులు వరి పంటను సాగు చేశారు. బొంరాస్‌పేట మండలంలో గత ఏడాది యాసంగిలో 12 వేల ఎకరాలలో వరి పంటను సాగు చేస్తే ఈ ఏడాది 7082 ఎకరాలలో సాగు చేశారు. బొంరాస్‌పేట, మెట్లకుంట, బురాన్‌పూర్, కొత్తూరు తదితర గ్రామాల్లోని చెరువులు పూర్తిగా నిండినా రైతులు వరి పంటను సాగు చేయలేదు. బోర్ల కింద కొంత వరిని, కొంత ఇతర పంటలను సాగు చేశారు.
ధాన్యం కొనకుంటే నష్టమే
యాసంగిలో రైతులు ధైర్యం చేసి వరి పంటను సాగు చేశారు. మరో రెండు నెలల్లో వరి పంటలు చేతికొస్తాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో రైతులు తేల్చుకోలేకపోతున్నారు. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ధా న్యాన్ని కొంటేనే రైతులకు మేలు కలుగుతుంది. లేకపోతే బయట మార్కెట్లో అమ్ముకుంటే మద్ధతు ధర రాక తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రమే వడ్లను కొనాలి
ఎప్పటిలాగే యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. యాసంగి ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడంతో రెండెకరాల్లోనే వరి సాగు చేశాను. బయట మార్కెట్లో అమ్ము కుంటే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. కాబట్టి కేంద్రం స్పందించి రైతులకు మేలు చేయాలి.
-రవీందర్, రైతు మెట్లకుంట
కేంద్రం నిర్ణయంతో సాగు తగ్గింది
యాసంగి ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడంతో రైతులు యా సంగిలో వరి పంటను సగానికి తగ్గించారు. చెరువుల కింద ఉన్న భూములు వరి పంట సాగుకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఇతర పంటలు పండవు. దీంతో చాలా మంది రైతులు వరిని సాగు చేయలేదు.
-మహేందర్‌రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు