రంగారెడ్డి, మార్చి 25, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలోని గ్రామ పంచాయతీలు స్వచ్ఛ పల్లెలుగా మారుతున్నాయి. నర్సరీలు మొదలుకొని డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, మురుగు కాల్వల నిర్మాణం, తడి, పొడి చెత్త సేకరణ, ట్రాక్టర్ల మంజూరు, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, ప్రతిరోజూ పం చాయతీల్లోని రోడ్లను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా జనాభా ప్రతిపాదికన ప్రతినెలా నిధులను మంజూరు చేస్తున్నది. జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలకు ప్రతినెలా ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతో గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని గ్రామ పం చాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని గ్రామాల్లో వివిధ దశల్లో పనులు ఉన్నాయి. అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి అన్ని గ్రా మ పంచాయతీలకు పక్కాగా రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఏడేండ్లుగా రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తూ వస్తున్నది.
రూ.45.73 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామా ల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటికే 50 శాతం మేర గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికాగా, మిగతా పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నారు. గతంలో గ్రామాల్లోని మట్టి రోడ్లతో వర్షాకాలం వస్తే ప్రజలు ఇబ్బందులు పడే వారు. అంతేకాకుండా రోడ్లపై నీరు నిలిచి దోమలు పెరిగి ప్రజ లు అనారోగ్యానికి గురయ్యేవారు. అయితే పల్లెప్రగతి పథకం క్రింద ప్రభుత్వం నుంచి ప్రతినెలా అందుతున్న నిధులతో గ్రామాలకు మహర్దశ వచ్చింది. ‘పల్లెప్రగతి’ ప్రారంభమైన గత మూడేండ్ల నుంచి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలకు ప్రతినెలా నిధులు అందుతున్నా యి. జిల్లాలోని అన్ని పంచాయతీలకు ప్రభుత్వం రూ. 9.98 కోట్ల నిధులు విడుదల చేసింది. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభు త్వం రూ.45.73 కోట్ల నిధులను విడుదల చేయగా.. ఆ నిధులతో జిల్లావ్యాప్తంగా 779 పనులు మంజూరై.. ఇప్పటికే 352 పనులకు సంబంధించి రూ.21 కోట్లతో పనులు పూర్తయ్యాయి.
ఆయా మండలాలకు విడుదలైన నిధులకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో రూ.1.35 కోట్లు, చౌదరిగూడెంలో రూ.1.75 కోట్లు, ఆమనగల్లులో రూ.80 లక్షలు, కొందుర్గులో రూ.1.23 కోట్లు, మంచాలలో రూ.1.85 కోట్లు, ఫరూఖ్‌నగర్‌లో రూ.1.84 కోట్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.2.10 కో ట్లు, యాచారంలో రూ.2.20 కోట్లు, నందిగామలో రూ. 1.80 కోట్లు, చేవెళ్లలో రూ.2.28 కోట్లు, మాడ్గులలో రూ.1.45 కోట్లు, కేశంపేటలో రూ.1.36 కోట్లు, శంకర్‌పల్లిలో రూ.2.46 కోట్లు, కడ్తాల్‌లో రూ.1.25 కోట్లు, మహేశ్వరంలో రూ.4.85 కోట్లు, తలకొండపల్లిలో రూ. 2.30 కోట్లు, కొత్తూరులో రూ.55 లక్షలు, మొయినాబాద్‌లో రూ.3.45 కోట్లు, కందుకూరులో రూ.5.60 కోట్లు, షాబాద్‌లో రూ.2.60 కోట్లు, శంషాబాద్‌లో రూ.2.65 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా నిధులు
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగం గా గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నది. జిల్లాకు ప్రతినెలా సుమారుగా ప్రభుత్వం నుంచి రూ.10 కోట్ల వరకు నిధులు వస్తున్నాయి.వాటితో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల రూపురేఖలు మారిపోతున్నాయి. ‘పల్లెప్రగతి’తో జిల్లాలోని గ్రామాలు స్వచ్ఛ పల్లెలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
-అమయ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్