రంగారెడ్డి, మార్చి 22, (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)సభ్యుల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు సుస్థిరమైన జీవనోపాధిని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతేడాది ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి గ్రామ సంఘంలో వ్యాపారం చేసేందుకు ఆసక్తి కలిగిన ముగ్గురు చొప్పున సభ్యులను సెర్ప్ అధికారులు ఎంపిక చేశారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాం తాల్లో స్థానిక పరిస్థితులను బట్టి వ్యాపారాలను ఎంచుకునేలా, ఒక గ్రామంలోని సభ్యులందరూ ఒకే విధమైన వ్యాపారాలు చేయకుండామహిళా సంఘాల సభ్యులకు అవగాహ న కల్పించారు. ఎంచుకున్న వ్యాపారాల్లో నష్టపో కుండా వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. కాగా ప్రభు త్వం ఎస్‌హెచ్‌జీ సభ్యులు వ్యాపారాలు చేసుకునేందుకు వీలు గా బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి ద్వారా రుణాలను మం జూరు చేస్తున్నది. సెర్ప్ సీఈవోతోపాటు రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ కూడా ప్రత్యేక దృష్టి సారించడంతో ఎంటర్ప్రైజెస్ కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది.కాగా జిల్లాలో 769 గ్రామ సంఘాలుండగా 19,157 స్వయం సహాయక సంఘాలు, వాటిలో 2,17,417 మంది సభ్యులున్నారు.
ఏడాదిలో రూ.32.92 కోట్లకు చేరిన వ్యాపారం
ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. రాష్ట్రంలో కామారెడ్డి, నల్లగొండ జిల్లాల తర్వాత రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఎంచుకున్న వ్యాపారాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో మెళకువలు నేర్పించడంతో వారు లాభాలను ఆర్జిస్తున్నారు. జిల్లాలో 2,979 మంది స్వయం సహాయక సభ్యులు 56 రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అందులో ఉత్పత్తి, వ్యాపారం, సేవా రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. కిరాణా షాపు, బేకరీ, బట్టల షాపు, ఎంబ్రాయిడరీ షాపు, చేపల విక్రయ కేం ద్రం, ఎలక్ట్రికల్ దుకాణం, హార్డ్‌వేర్, ఇంటర్నెట్, బ్యూటీపార్లర్, హోటల్, టిఫిన్ సెంటర్, మెడికల్ షాప్, సూపర్ మార్కెట్, మొబైల్ షాప్ తదితర వ్యాపారాలను చేస్తున్నారు. వ్యాపారాలను ప్రారంభించిన ప్రతి ఒక్కరూ ఎడాదిలోనే లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రతిరోజూ దాదాపుగా రూ.ఐదువేల వరకు సంపాదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,979 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు చేస్తున్న వ్యాపారాలతో దాదాపు ఆయా వ్యాపారాల విక్రయ విలువ రూ.32.92 కోట్లకు చేరింది.
ఆదాయం మూడింతలు పెరిగింది
ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా చేపల విక్రయ వ్యాపారాన్ని రూ.లక్షతో నందిగామ మండల కేంద్రంలో గతేడాదిగా నిర్వహిస్తున్నా. దీంతో ఆర్థికంగా ఎదుగడంతోపాటు మరో నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నా. ప్రతిరోజూ రూ.ఐదు వేల వరకు సంపాదిస్తున్నా. ఆదాయం మూడింతలు పెరిగింది. -గడ్డం జయమ్మ, అప్పారెడ్డిగూడ, నందిగామ మండలం
ప్రతినెలా రూ.పది వేల వరకు మిగులుతున్నాయి
మాది నిరుపేద ఎస్టీ కుటుంబం. కొన్నేండ్లుగా నేను బంజారా ఎంబ్రాయిడరీ వర్క్‌ను నేర్చుకుంటున్నా. నాతోపాటు మా గ్రామంలోని 250 మంది వరకు జీవనోపాధిని పొందుతు న్నాం. మా గ్రామంలోనే కాకుండా కొర్రవానితండా, బోడకొండ, సత్యం తండా, అంబోతు తండాలకు చెందిన వారికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్‌లో శిక్షణ ఇచ్చాం. మా వ్యాపారంలో మొదట ఖర్చులు పోను కేవలం రూ.500వరకు లాభాలురాగా, ప్రస్తుతం ప్రతినెలా రూ.10 వేల వరకు డబ్బులు మిగులుతున్నాయి. మా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందింది. మరింత మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– కేతావత్ లక్ష్మీబాయి, ఎల్లమ్మతండా, మంచాల మండలం
మగ్గం వర్క్‌తో ఆర్థికంగా నిలదొక్కుకున్నా..
మగ్గం వర్క్‌తో ఆర్థికంగా నిలదొక్కుకున్నా. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 వేలతో మగ్గం వర్క్ యూనిట్‌కు కొనుగోలు చేశా. ప్రస్తుతం నెల కు దాదాపుగా రూ.15 వేల వరకు సంపాదిస్తున్నా. ఇరుగుపొరుగు వారికి ఉచితంగా మగ్గం వర్క్‌ను నేర్పిస్తున్నా. మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల్లేవు.
-ఆశ్వల మానస, జాపాల గ్రామం, మంచాల మండలం