పరిగి, మార్చి 21 : రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఉద్యోగార్థులు కోరిన మేరకు ఆయా ఉద్యోగ నియామకాల పరీక్షలకు సన్నద్ధమవడానికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక మెటీరియల్ ఆయా శాఖా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వం 80,039 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తుంది. డబ్బులు ఉన్నవారు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందుతారు. పేద వారి కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఉచిత శిక్షణ ఇవ్వడానికి జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు శిబిరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలో వారు నిమగ్నమయ్యారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 18 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. ఇప్పటికే వికారాబాద్, పరిగి గ్రంథాలయాలకు ఉద్యోగార్థులకు ఉపయోగపడే 320 ప్రత్యేక మెటీరియళ్లను తెప్పించారు. ఎన్సీఆర్టీకి సంబంధించి 5 సెట్స్ సైతం తెప్పించారు. ఇవేకాకుండా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక మెటీరియల్ తెప్పించేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ రూ.15లక్షలు కేటాయించింది. ఈ నిధులు సైతం సరిపోకపోతే మరో రూ.5లక్షల వరకు మెటీరియల్ కోసం ఖర్చు చేసేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ సిద్ధంగా ఉన్నది.
ప్రతి ఉద్యోగానికి భారీ పోటీ..
ప్రభుత్వం 80,039 ఉద్యోగాల నియామకాల ప్రక్రియ చేపట్టనుండగా ఈసారి పోటీ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో జిల్లా కేడర్ పోస్టులు 738, జోనల్ పోస్టులు 5297, మల్టీ జోనల్ పోస్టులు 6,370, గ్రూప్-1 పోస్టులు 503, గ్రూప్-2 పోస్టులు 582, గ్రూప్-3 పోస్టులు 1373, గ్రూప్-4 పోస్టులు 9168 నియామకం జరుగనుంది. జిల్లా పరిధిలోని కేడర్ పోస్టులన్నీ 95శాతం జిల్లా వాసులకే దక్కనున్నాయి. మరోవైపు అభ్యర్థుల వయో పరిమితిని సైతం పెంచడం ద్వారా ఉద్యోగార్థుల సంఖ్య పెరుగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ తీసుకున్న నిర్ణయంతో పేద వారికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.
ప్రతి గ్రంథాలయంలో ఆన్ డిమాండ్ రిజిస్టర్..
వికారాబాద్ జిల్లా పరిధిలోని 18 శాఖా గ్రంథాలయాల్లో ఆన్ డిమాండ్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకులు ఈ రిజిస్టర్లో ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తమకు అవసరమైన పుస్తకాల వివరాలు రాయాల్సి ఉంటుంది. పాఠకులు కోరిన మేరకు ఆయా పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ 10 రోజుల్లో తెప్పించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన వెంటనే పాఠకులు తమకు అవసరమైన మెటీరియల్ కోసం ఆన్ డిమాండ్ రిజిస్టర్లో రాయనున్నారు. వెనువెంటనే ఆయా శాఖా గ్రంథాలయాలకు అవసరమైన సంఖ్యలో ఉద్యోగ నియామక పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్‌ను తెప్పించి అభ్యర్థులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇందుకుగాను జిల్లా గ్రంథాలయ సంస్థ ఈసారి బడ్జెట్లో రూ.15లక్షలు కేటాయించింది. ఈ డబ్బులు సరిపోనియెడల అదనంగా నిధుల కేటాయింపునకు సైతం సిద్ధంగా ఉన్నది. వికారాబాద్‌లోని కేంద్ర గ్రంథాలయంలో ప్రత్యేకంగా ఉద్యోగార్థులు కూర్చొని చదువుకునేందుకు భవనం పై భాగంలో షెడ్డు వేయించి ఏర్పాట్లు చేస్తున్నది. దీంతోపాటు జిల్లాలోని పరిగి, కులకచర్ల, పెద్దేముల్, బంట్వారం శాఖా గ్రంథాలయాల్లోనూ కూర్చొని చదువుకునేందుకు అవసరమైన స్థలం ఉన్నది. ఉద్యోగార్థుల కోసం గ్రంథాలయాల పనివేళలు సైతం పొడిగింపునకు చర్యలు చేపట్టనున్నారు. కరోనా సంక్షోభ సమయం నుంచి ప్రతిరోజూ ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రంథాలయాలు తెరిచి ఉంచుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలై ఉద్యోగార్థులు చదువుకునేందుకు గ్రంథాలయాలకు వస్తే పనివేళలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెంచడానికి సైతం చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ఉద్యోగావకాశాల కోసం సన్నద్ధమయ్యే వారికి సౌకర్యవంతంగా ఉండేలా చూస్తున్నారు. దీంతో అభ్యర్థులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.
ప్రత్యేక మెటీరియల్ తెప్పిస్తాం
ఉద్యోగార్థులకు అవసరమైన మెటీరియల్ తెప్పించి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు 2022-23 సంవత్సరం బడ్జెట్లో రూ.15లక్షలు కేటాయించాం. ఈ నిధులు సరిపోకపోతే మరో రూ.5లక్షలు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో ఆన్ డిమాండ్ రిజిస్టర్లు ఏర్పాటు చేశాం. ఉద్యోగార్థులు తమకు ఏ ఉద్యోగ నియామకాల పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కావాలని కోరితే, అందుకు అనుగుణంగా పుస్తకాలు తెప్పించి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. ఉద్యోగార్థులు అధికంగా ఉన్న దగ్గర గ్రంథాలయాల పనివేళలు సైతం పెంచుతాం.
– పి.సురేశ్‌బాబు, కార్యదర్శి, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ