కడ్తాల్, నవంబర్ 26 : మొక్కల పెంపకంలో అధికారులు అలసత్వం వహించరాదని డీఆర్డీఏ ప్రభాకర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, ఎవెన్యూ ప్లాంటేషన్‌ను సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ మాట్లాడుతూ గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని, మొక్కలకు ప్రతి రోజూ రెండు సార్లు నీళ్లు అందించాలని తెలిపారు. 2023-24 హరితహారం కార్యక్రమానికి మొక్కలను పెంచేందుకు నర్సర్సీలను సిద్ధం చేయాలన్నారు. మొక్కల పెంపకం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. నర్సరీల్లో వేప, కానుగ, రావి, నేరేడు, జమ్మి, మర్రి మొక్కలను పెంచాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి జగన్, ఈజీఎస్ టీఏ సద్గుణ, ఎఫ్ఏ వెంకటేశ్ పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కడ్తాల్ : మహిళల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీఆర్డీఏ ప్రభాకర్ అన్నారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు తయారు చేసిన పచ్చళ్ల విక్రయ కేంద్రాన్ని శనివారం మండల కేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పీడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి మహిళా స్వయం సహాయక సంఘాలు దోహదపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్య ద్వారా అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, వార్డు సభ్యులు భిక్షపతి, ఎట్టెమ్మ, నాయకులు వెంకటయ్యగౌడ్, రామచంద్రయ్య, వెంకటయ్య, నాగార్జున్, యాదయ్య, బాల్‌రాజ్ పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
ఆమనగల్లు : ప్రతి మొక్కనూ సంరక్షించాలని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. చింతలపల్లి, మంగళపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించారు. కొత్త ప్లాంటేషన్లలో పాలిథీన్ కవర్లలో మట్టిని నింపాలని సూచించారు. ఆయన వెంట డీపీఎం కరుణశ్రీ, ఏపీవోలు బాలరాజ్, మాధవరెడ్డి ఉన్నారు.