సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి ఫార్ము లా ఈ కార్ రేసిం గ్ పోటీలు దేశంలోనే మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరంలో జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఒకేసారి 30 వేల మంది ప్రేక్షకులు కూర్చొని రేసింగ్ పోటీలు వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు. 17 మలుపులతో 2.7 కి.మీ మేర ట్రాక్ చుట్టూ సుమారు 9 నుంచి 10 చోట్ల ప్రేక్షకుల గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత వేగంగా పరుగులు పెట్టే రేసింగ్ కార్లను వీక్షించేందుకు పటిష్ట భద్రత చర్యలు చేపడుతూ ట్రాక్‌కు 10-15 మీటర్ల దూరంలో ప్రేక్షకులు కూర్చుని చూసేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ట్రాక్‌కు ఇరువైపులా కాంక్రీట్‌తో రూపొందించిన ఫ్రీకాస్ట్ డివైడర్లు, వాటి మీద 4 మీటర్ల ఎత్తు ఉన్న ఇనుప కంచెను ఏర్పాటు చేస్తున్నారు. కార్ రేసింగ్ అనుభూతిని పొందేందుకు అనువైన ప్రాంతాలను హెచ్ఎండీఏ అధికారులు ఎంపిక చేసి, కూర్చునేందుకు మెట్ల మాదిరిగా ఉండే సీట్లను చెక్కతో తయారు చేసిన వాటిని బిగిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇన్నాళ్లు స్పోర్ట్స్ చానెల్స్‌లో రేసింగ్ పోటీలు తిలకించి సంబుర పడిపోయేవారు. అట్లాంటి ఆ రేసింగ్‌ను హైదరాబాద్ నగర వాసులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో కనిపించే రేసింగ్ కార్లు హుస్సేన్ సాగర్ తీరంలో రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్లనున్నాయి.
ఫార్ములా-ఈ రేసింగ్‌కు ముందే ఇండియన్ రేసింగ్ లీగ్..
హుస్సేన్‌సాగర్ తీరంలో కొత్తగా నిర్మిస్తున్న ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్‌పై ముందుగా ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 19,20 తేదీల్లో, అలాగే డిసెంబర్ 10, 11న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఫార్ములా -ఈ కార్ రేసింగ్ 9వ విడుత పోటీలు మాత్రం 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. నవంబర్ 19, 20 తేదీల్లో జరిగే ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీల్లో దేశంలోని ఐదు టీమ్‌లు పాల్గొననున్నాయి. ఇందులో హైదరాబాద్ నగరానికి చెందిన టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్, స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ ఉన్నాయి. ఇందుకోసం హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్‌ను ప్రస్తుతం ఫార్ములా -ఈ రేసింగ్ కోసం నిర్మిస్తున్న 2.7 కి.మీ ట్రాక్‌ను వినియోగించుకొని ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నగరంలో జరుగుతుండగా, టిక్కెట్ల విక్రయాలు ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి. కాగా హైదరాబాద్‌లో మొట్ట మొదటిసారిగా ఒకే ట్రాక్‌పై జాతీయ స్థాయిలో కార్ల రేసింగ్ పోటీ, దాని తర్వాత అంతర్జాతీయ స్థాయి అయిన ఫార్ములా -ఈ కార్ల రేసింగ్ పోటీలు జరుగుతుండటం విశేషం.