స్పోర్ట్స్‌కు ప్రతి గ్రామానికి రూ.5వేలు ఇస్తాం
అవసరం మేరకు నిధులు మంజూరు చేస్తాం
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి
వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ అభివృద్ధికి రూ.కోటి : ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, మార్చి 18 : క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్లో రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 33 జిల్లాల నుంచి కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. పార్టీలకు అతీతంగా క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామానికి స్పోర్ట్స్ కోసం రూ.5వేలు అందజేస్తామని, అదేవిధంగా మండలానికి ఒక గ్రౌండ్‌ను ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎక్కువగా కులక్కచర్ల, పరిగి మండలాల నుంచి క్రీడాకారులు రాణిస్తున్నారని, అన్ని ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు సైతం ప్రతిభను చాటి ముందుకు రావాలన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ అభివృద్ధికి కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తామన్నారు. క్రీడలు ఆడేందుకు మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని జిల్లాల క్రీడాకారులు ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పేరొందన్నారు. వెనుకబడిన గ్రామాలు, తండాల ప్రజలు నిరుత్సాహ పడకుండా పోటీలో గెలుపొందిన పలువురి విజేతలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిదేమిలేదన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా నైపుణ్యత సాధించి ప్రాంతానికి మంచి పేరు తేవాలని సూచించారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ క్రీడలు గ్రామాలకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో వారి ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అంతకు ముందు విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నృత్యాలు, విన్యాసాల పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ, జిల్లా క్రీడల అధికారి హన్మంత్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోఠాజీ, రాష్ట్ర నాయకులు వడ్ల నందు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాఘవన్‌నాయక్, డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.