షాద్‌నగర్‌రూరల్, నవంబర్ 2 : గ్రామాలకు పచ్చనిహారాన్ని తొడిగినట్లు, పుడమితల్లి పచ్చదనంతో పులకిరిస్తున్నట్లు ఎక్కడ చూసినా, ఏ గ్రామం చూసినా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కార్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నది. ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాడు నాటిన మొక్కలు నేడు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో డంపింగ్‌యార్డ్, చెత్త సేకరణ, వైకుంఠధామాలు, సీసీరోడ్లు, వీధి దీపాలు, ఇంటింటికీ నల్లాల వంటి అభివృద్ధి పనులతో పాటు పాడి పరిశ్రమ, ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం పల్లె ప్రకృతి వనాలు, హరితహారం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
పల్లె ప్రకృతితో గ్రామాల్లో సరికొత్త శోభ
ఫరూఖ్‌నగర్ మండలంలోని 47గ్రామ పంచాయతీల్లో ప్రతి సంవత్సరం సర్కార్ సూచనల ప్రకారం హరితహారం కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు సమిష్టిగా విజయవంతం చేయడంతో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. పచ్చదనం ఉంటే సకాలంలో వర్షాలు కురుస్తాయని, దీంతో పాడిపరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని, ప్రజలకు ఎలాంటి అంటూ వ్యాధులు వ్యాపించవనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు విజయవంతంగా నిర్వహిస్తు మొక్కలు నాటడడంతో పాటు వాటిని సంరక్షిస్తున్నారు. దీంతో నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి.
పచ్చదనంతో కనువిందు
నాడు హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా పచ్చనిమొక్కలను నాటాం. వాటిని కంటిరెప్పాలా కాపాడాం. నేడు అవి వృక్షాలుగా మారి కనువిందు చేస్తున్నాయి. గ్రామాల అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సంతోషంగా ఉంది.
–బద్దుల శ్రీశైలం, సర్పంచ్ కిషన్‌నగర్,ఫరూఖ్‌నగర్ మండలం
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణ అందరి బాధ్యత. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలి. మనం నాటే మొక్కలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి.
–మౌనిక, సర్పంచ్ హాజపల్లి, ఫరూఖ్‌నగర్ మండలం