రంగారెడ్డి/వికారాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ):డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో పురోగతి వేగంగా కొనసాగుతున్నది. పేదలకు ఇండ్లను అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఫలిస్తున్నది. బడుగు బలహీన వర్గాల బతుకులకు ఒక గూడు కల్పించి, సమాజంలో వారికో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం రెండు పడకల ఇండ్ల పథకాన్ని 2015లో అందుబాటులోకి తెచ్చింది. ఎవరికైతే ఇల్లు అనేది ఒక తీరని కలగా మిగిలిపోనుందో.. అటువంటి వారి ఆశలు, కలలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసే దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల పనులు కొలిక్కి రాగా.. మరికొన్ని చోట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్థలాభావం రీత్యా పట్టణాల్లో 2బీహెచ్‌కే ఫ్లాటు, గ్రామీణ ప్రాంతంలో రెండు పడకల స్వతంత్ర ఇల్లును కట్టి ఇస్తున్నారు. 125 చదరపు గజాల స్థలంలో ప్రభుత్వం ఇల్లు కట్టి అప్పగిస్తున్నది. ఖర్చుతో పాటు ఇంటి స్థలాన్ని ఉచితంగా అర్హులకు అందజేస్తున్నది. ఈ తరహా ఇండ్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు ప్రధానంగా వారి ఆర్థిక స్థితిగతులను బట్టి అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆదాయం, ఆహార భద్రతా కార్డుతో పాటు బీపీఎల్ (దారిద్య్రరేఖకు దిగువ) వర్గంవారు అర్హులు. అయితే, ఇంటిని గృహిణి పేరుపై అందజేయనున్నది. నిరాశ్రయులైన ఎన్నో కుటుంబాలకు, గుడిసెలు, అద్దె ఇండ్లల్లో వారికి, దివ్యాంగులు, విభిన్న సామర్థ్యం ఉన్న పౌరులకు అందనున్నాయి.
6377 టూబీహెచ్‌కే గృహాలు మంజూరు
రంగారెడ్డి : రెండు పడకల గృహాల పథకం ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిషత్, శాసనసభ నియోజకవర్గ పరిధిలో 2015-16, 2016-17 సంవత్సరాలకు 6777 2బీహెచ్‌కే ప్రభుత్వం గృహాలను కేటాయించింది. ఎమ్మెల్యేలు, మంత్రితో కూడిన కమిటీ ద్వారా కలెక్టర్ 6637 2బీహెచ్‌కే గృహాలను నిర్మించేందుకు మంజూరు చేశారు. ఈ ఇండ్ల నిర్మాణానికి 274.35 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. మంజూరైన 6637 గృహాల్లో 1705 ఇండ్లు చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జిల్లా పంచాయతీరాజ్ శాఖకు, ఇంకా 4932 గృహాలు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో నిర్మించేందుకు జిల్లా రోడ్స్, బిల్డింగ్స్ శాఖలకు అప్పగించారు. చేవెళ్ల, కల్వకుర్తిలకు మంజూరైన ఇండ్లు 1705లకు టెండర్లు పిలిచింది. 1635 నిర్మాణాలకు టెండర్ ఆమోదించి, వంద గృహాలకు వర్క్ ఆర్డర్ రాగా.. నేడు వంద నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఇక్కడ 20 ఇండ్లు దాదాపుగా సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు మీ సేవలో 10,816 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్అండ్బీ నేతృత్వంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో మంజూరైన ఇండ్లు 4932, వీటిలో టెండర్లు ఆమోదించింది 2736 గృహాలకు, కాగా, 2537 ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. 2041 ఇండ్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఇండ్ల నిర్మాణానికి 86,807 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 97,623 దరఖాస్తులు వచ్చాయి. కాగా, మరికొన్ని ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు పిలువాలి. మరికొన్ని ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది.
టెండర్ల ఆమోదం.. నిర్మాణాలు పూర్తయినవి..
చేవెళ్ల నియోజకవర్గంలో 100 గృహాలకు టెండర్ ఆమోదం రాగా, వంద గృహాల నిర్మాణాల్లో పురోగతి ఉన్నది. కాగా, 20 ఇండ్లు నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. వీటి కోసం 7778 మంది దరఖాస్తు చేసుకున్నారు. కల్వకుర్తిలో 645 గృహ నిర్మాణాలకు టెండర్ ఆమోదం లభించలేదు. ఇక్కడ పురోగతి, నిర్మాణాల పూర్తికి తావులేదు. ఇక్కడ 3038 మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో మంజూరైనవి 1200. కాగా, 1056 గృహాల నిర్మాణానికి టెండర్లు పిలువగా, 339 గృహాలకు ఆమోదం లభించింది. 335 గృహాలు పురోగతిలో ఉన్నాయి. 131 గృహాలు నిర్మాణం దాదాపు పూర్తి చేసుకున్నాయి. ఇందుకు 12,904 దరఖాస్తులు వచ్చాయి. మహేశ్వరంలో మంజూరైనవి 392. కాగా, 192 గృహాల నిర్మాణానికి టెండర్లు పిలవగా, 192 గృహాలకు ఆమోదం లభించింది. 192 గృహాలు పురోగతిలో ఉన్నాయి. 80 గృహాలు దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇందుకు 11484 దరఖాస్తులు వచ్చాయి. రాజేంద్రనగర్‌లో మంజూరైనవి 240. కాగా, 240 గృహాల నిర్మాణానికి టెండర్లు పిలవగా, 130 గృహాలకు ఆమోదం లభించింది. 130 గృహాలు పురోగతిలో ఉన్నాయి. 130 గృహాలు దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇందుకు 58767 దరఖాస్తులు వచ్చాయి. షాద్‌నగర్‌లో మంజూరైనవి 3100. కాగా, 3052 గృహాల నిర్మాణానికి టెండర్లు పిలవగా, 2065 గృహాలకు ఆమోదం లభించింది. 1880 గృహాలు పురోగతిలో ఉన్నాయి. 1700 గృహాలు దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇందుకు 3652 దరఖాస్తులు వచ్చాయి. కాగా, ఇంకా మరికొన్ని నిర్మాణాత్మక పనులు జరుగుతున్నాయి. చాలా చోట్ల మౌలిక సదుపాయాల కల్పన జరుగాల్సి ఉంది.
మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలి:రాజేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, గృహ నిర్మాణ శాఖ, రంగారెడ్డి జిల్లా
ఇప్పటికీ కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయి. డ్రైనేజీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, తదితర మౌలిక సదుపాయాలను కల్పించుకోవాల్సి ఉంది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని నిర్మాణాలకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఆ దిశగా ఆమోదం పొందాల్సి ఉంది. మరికొన్ని పనులు ఇంకా జరుగాల్సి ఉంది. ఇలాంటి ఎన్నో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయితే, మరో రెండు, లేదా మూడు నెలల సమయంలో నిర్మాణాలు పూర్తి కావొచ్చు. మన పరిధిలో ఉన్న నిర్మాణాలకు రూ.9 కోట్లను వెచ్చిస్తున్నాం. ప్రధానమైన పనులు మరెన్నో జరుగాల్సి ఉంది.
రంగారెడ్డి/వికారాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)వికారాబాద్ : జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం జిల్లాకు 3873 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటివరకు 2357 ఇండ్ల నిర్మాణ పనులు పూర్తికాగా, పలు ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1200 ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో సంబంధిత ఇండ్లలో మౌలిక సదుపాయాలను కల్పించే పనులు కూడా పూర్తయ్యాయి. కులకచర్ల మండలం అడవి వెంకటాపూర్‌లో 30 ఇండ్లు, యాలాల మండల కోకట్‌లో 180 ఇండ్లు, పూడూరు మండలంలో 300 ఇండ్లు, పరిగిలో 180 ఇండ్లు పూర్తికాగా.. ధారూరులో 300 ఇండ్లు, మోమిన్‌పేట్‌లో 300 ఇండ్లు, మర్పల్లి మండలంలో 300 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా సంబంధిత ఇండ్ల మౌలిక సదుపాయాలను కల్పించే పనులు చేపట్టాల్సి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకుగాను ఇప్పటికే నిధులు మంజూరుకాగా పనులు చేపట్టనున్నారు.
1200 ఇండ్ల నిర్మాణం పూర్తి
వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గాలకు 3873 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకాగా పరిగి మండలానికి 480 ఇండ్లు, చేవెళ్ల నియోజకవర్గంలో 258, కొడంగల్ నియోజకవర్గంలో 394, తాండూరు నియోజకవర్గానికి 1740, వికారాబాద్ మున్సిపాలిటీకి 401, వికారాబాద్ నియోజకవర్గానికి 600 ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 1200 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లకుగాను దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను టీఎస్టీఎస్ సంస్థ పరిశీలన ప్రక్రియను పూర్తి చేయగా, త్వరలోనే గ్రామసభలు నిర్వహించి గతంలో ప్రభుత్వం ఇండ్లు మంజూరయ్యాయా లేదా అనే వివరాలను గ్రామసభ ద్వారా సేకరించిన అనంతరమే లబ్ధిదారుల తుది జాబితాను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతుండగా.. త్వరలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయాన్ని మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సొంత జాగా ఉంటే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికిగాను అయ్యే ఖర్చును గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. యూనిట్ కాస్ట్‌తోపాటు మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలను, అర్బన్ ప్రాంతంలో రూ.75వేలను డ్రైనేజీ, నీటి వసతి తదితర మౌలిక వసతులకుగాను ప్రభుత్వం అందజేయనుంది.