ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 31 : వర్షాకాలం సీజనల్లో ఇబ్రహీంపట్నం మండలంలో రైతులు సాగుచేసిన వరిపంట ఆశాజనకంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరుగడంతో ధాన్యం దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వానకాలం సీజనల్ ఆరంభం నుంచే భారీగా వర్షాలు పడటంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బోరుబావుల్లో నీరు పుష్కలంగా చేరడంతో వరిసాగుకు నీరు కూడా అధికంగా అందింది. దీంతో ఈ ఏడాది రైతులు వరిసాగును అధికంగా సాగు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో సుమారు 12 వేల ఎకరాల్లో రైతులు ఈ సీజన్లో వరిసాగు చేశారు. పంట కోతదశకు చేరింది. అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో ఇబ్రహీంపట్నం మండలంలోనే 2.50లక్షల నుంచి 3 లక్షల క్వింటాళ్ల వరకు వరిధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు తెలిపారు. దీనికి తోడు రైతులు పచ్చిరొట్ట ఎరువులు, వెదజల్లే విధానం ద్వారా పంట అత్యధికంగా గింజపోసుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా ఈ వారంలోగా వరి కోతలు చేసే అవకాశముంది.
దిగుబడులపై ఆశలు..
వరి పంటకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో దిగుబడులు పెరుగుతాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుపై కొంత అయోమయం ఏర్పడినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులు నష్టపోవద్దని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వర్షాలతో పంట కూడా ఏపుగా పెరిగింది. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురవడంతో తెగుళ్ల సమస్య ఉన్నప్పటికీ నష్టపోయే పరిస్థితి కనిపించలేదు. తెగుళ్ల నివారణకు వ్యవసాయాధికారుల సూచనలతో సస్యరక్షణ చర్యలు పాటించటం ద్వారా పంటలు అత్యధికంగా గింజపోసుకుని కోతదశకు చేరుకున్నాయి.
దిగుబడి అధికంగా వచ్చే అవకాశం
వర్షాలు సమృద్ధిగా కురువడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వరికి సరైన గిట్టుబాటు ధర కల్పిస్తుందన్న నమ్మకంతో రైతులు ఇబ్రహీంపట్నం మండలవ్యాప్తంగా సుమారు 12వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. సాగుచేసిన రైతులు వ్యవసాయాధికారుల సూచనల మేరకు సరైన సస్యరక్షణ చర్యలు పాటించారు. దీంతో మంచి దిగుబడి రాన్నునది. ప్రస్తుతం వరి కోతదశలో ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– శ్రవణ్‌కుమార్, ఏఈవో ఇబ్రహీంపట్నం