బోనులో గొర్రె పిల్లను ఉంచిన ఫారెస్టు అధికారులు
నాలుగేండ్లుగా తప్పించుకుంటున్న చిరుత
తాజాగా తాటిపర్తి అటవీ ప్రాంతంలో లేగదూడలపై దాడి
వణికిపోతున్న పరిసర రైతులు
యాచారం, మార్చి 18 : మండలంలో ఓ చిరుత మూగజీవాలపై గత కొన్ని రోజులుగా వరుస దాడులకు పాల్పడుతున్నది. బుధవారం రాత్రి తాటిపర్తి గ్రామంలో రెండు లేగ దూడలను తిన్నది. దీంతో తాటిపర్తి అటవీ ప్రాంతం పరిసరాల్లోని రైతులు వణికిపోతున్నారు. ఎలాగైనా చిరుతను బంధించి తమను, పశువులను రక్షించాలని రైతులు కోరుతున్నారు. దీంతో ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. చిరుత మూగజీవాలపై దాడులకు పాల్పడుతుందే తప్పా అధికారుల ఉచ్చుకు చిక్కడం లేదు. ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు చిరుత ఇటీవల దాడి చేసిన స్థలంలో బోనును ఏర్పాటు చేసి దానిలో ఓ గొర్రె పిల్లను ఎరగా వేశారు.
నాలుగేండ్లుగా చిక్కని చిరుత…
గత నాలుగేండ్లుగా ఐదు మండలాల్లో మేకలు, గొర్రెలు, లేగ దూడలను తింటూ రైతులకు నిద్ర లేకుండా చేస్తూ తప్పించుకు తిరుగుతున్నది. చిరుతను బంధించేందుకు అధికారులు తరచూ విఫలమవుతున్నారు. జిల్లాలోని యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్, మాడ్గుల, కందుకూరు మండలాల్లో గత నాలుగేండ్లకు పైగా ఓ చిరుత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే కొత్తపల్లి, మేడిపల్లి, కడ్తాల్, చరికొండ, తాడిపర్తి, గోవిందాయపల్లి, ఎక్వాయపల్లి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో సంచరించి మేకలు, గొర్రెలు, కుక్కలు, లేగ దూడలను, ఆవులను చంపి తింటూ తప్పించుకు తిరుగుతూ అటు రైతులను ఇటు ఫారెస్టు అధికారులను వణికిస్తున్నది. ఫారెస్టుకు ఆనుకొని ఉన్న శంకరాయమల అక్కడి నుంచి శ్రీశైలం ఫారెస్టు నుంచే చిరుత వలస వచ్చి ఉండొచ్చని, చిరుత ఒకటా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయా? అనే సందేహం సైతం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది.
చిరుత సంచరిస్తున్న పరిసరాల్లో ఇటు నాగార్జునసాగర్ రహదారి నుంచి అటూ శ్రీశైలం రహదారి వరకు 25కిలో మీటర్ల మేర 6వేల ఎకరాల దట్టమైన అడవితో పాటుగా 4వేల ఎకరాల రెవెన్యూ, గుట్టలు, గుహలతో కూడిన పొలాలున్నాయి. చిరుత సంచరించడానికి అక్కడి ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉన్నది. ఐదు మండలాల సరిహద్దుల్లో ఫారెస్టుకు ఆనుకొని ఉన్న వ్యవసాయ పొలాల్లోకి వచ్చి అక్కడున్న గొర్రెలు, మేకల మందలపైన, పశువుల పాకలపైన దాడులు చేస్తున్నది. ఇప్పటికే 26 చోట్ల దాడులు జరిపి అనేక జీవాలను చంపి తిన్నది. పైగా ఫారెస్టులో చిరుత దర్జాగా సంచరించడంతో రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు అధికారులు గతంలో కొత్తపల్లి, మేడిపల్లి, కుర్మిద్ద, చరికొండ, గోవిందాయపల్లి తదితర గ్రామాల్లో బోన్లు కూడా ఏర్పాటు చేసి ముమ్మర ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చిరుత బోన్లలో చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
చిరుతతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిరుతను బంధించే వరకు మేకలు, పశువులను ఫారెస్టు సమీపంలో కాకుండా గ్రామాలకు సమీపంలో ఉంచుకోవాలి. రాత్రిపూట పొలాల్లో మంటలు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. చిరుతను బంధించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. బోన్లు ఏర్పాటు చేసినా చిక్కకుండా తప్పించుకు తిరుగుతుంది. నీటి కోసం పొలాల వద్దకు రాకుండా అటవీ ప్రాంతంలోనే ఏర్పాటు చేశాం. దట్టమైన అడవిలో చిరుతకు అనుకూలమైన ప్రాంతాలు ఉండటంతో పట్టుకోవడం కష్టం అవుతున్నది. చిరుత దాడిలో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తాం. – నిఖిల్‌రెడ్డి, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్
తాటిపర్తిలో సెన్సార్ కెమెరాలకు చిక్కిన చిరుత
ఇటీవల మండలంలోని తాటిపర్తి ఫారెస్టులో చిరుత దాడికి పాల్పడిన ప్రాంతంలో ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన సెన్సార్ కెమెరాలకు చిరుత చిక్కిన విషయం తెలిసిందే. 10వేల ఎకరాల అటవీ ప్రాంతంలో గుట్టలు, గుహలు, దట్టమైన చెట్ల పొదలు ఉండటంతో పాటుగా నీటి వనరులు, పశువుల పాకలు, మేకల, గొర్రెల మందలపై దాడులు చేస్తూ చిరుత గత కొంత కాలంగా బోన్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది. రాత్రి పూట మూగజీవాలపై దాడులు చేసి ఉదయం పూట గుహల్లో తలదాచుకుంటుంది. గతంలో 30 జింక పిల్లలను సైతం అటవిలో చిరుతకు ఆహారంగా వదిలినా ప్రయోజనం లేకపోయింది. అది మళ్లీ దాడులు కొనసాగించడంతో చిరుత భయానికి సాయంత్రమే రైతులు, ప్రజలు ఇంటికి చేరుకుంటున్నారు. బోన్లకు చిక్కకుండా వరుస దాడులకు పాల్పడుతున్న చిరుతను అవసరమైతే రిస్క్ టీంను రంగంలోకి దింపి స్పెషల్ షూటర్స్‌తో గన్షూట్ చేసి మత్తు మందు ద్వారా అయినా పట్టుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.