రంగారెడ్డి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : అఖిల భారత సేవల అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు.. గ్రామీణ స్థితిగతుల అధ్యయనంతోనే పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని.. తద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలుగుతారని అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల శిక్షణ బృందం (13 మంది) శిక్షణలో భాగంగా సోమవారం పలు గ్రామాల పర్యటన అధ్యయనం కోసం రంగారెడ్డి జిల్లాకు విచ్చేశారు. సోమవారం నుంచి నవంబర్ 5 వరకు 13 మందితో కూడిన అధికారులను మూడు బృందాలుగా విభజిస్తూ.. ఒక్కో బృందానికి ఒక్కో గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేలా కేటాయించారు. యాచారం మండలంలోని గున్గల్, కొత్తూరు మండలంలోని పెంజర్ల, మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామాలకు సివిల్ సర్వీసెస్ అధికారులు సందర్శన నిమిత్తం వెళ్లనున్నారు. శిక్షణలో ఉన్న అధికారులు సమీకృత జిల్లా సముదాయాల భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. వారికి జిల్లా యంత్రాంగం తరఫున స్వాగతం తెలిపిన అదనపు కలెక్టర్.. పలు కీలక సూచనలు చేశారు. ఆ అధికారుల బృందాలు గ్రామాల్లో పర్యటించి గ్రామ స్థాయిలో ప్రజల జీవన విధానం, వ్యవసాయం, నీటి వసతి, విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి, యువత ఉపాధి, తదితర అంశాలను అధ్యయనం చేస్తారన్నారు. శిక్షణలో భాగంగా గ్రామ స్థాయి అధ్యయనం ఆయా అధికారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీకి అందుతున్న నిధులు, రైతు సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ, హరితహారం, విలేజ్ హెల్త్ ప్రొఫైల్, ఆసరా పింఛన్ పథకాలు, ఆయా కార్యక్రమాల అమలు తీరును వారికి సంక్షిప్తంగా వివరించారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్ రెడ్డి, సీపీవో ఓం ప్రకాశ్, జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునంద, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి మోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరి, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, అడిషనల్ డీఆర్డీవో నీరజ, ఏపీడీ జంగారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
గున్‌గల్‌కు ట్రైనీ అధికారుల బృందం
మండలంలోని గున్గల్ గ్రామానికి ట్రైనీ ఎంఐఈఎస్ అధికారుల బృందం సోమవారం గున్గల్ గ్రామానికి చేరుకుంది. ఎంపీడీవో విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌గౌడ్ వారికి స్వాగతం పలికారు. గ్రామంలో 31 నుంచి నవంబర్ 5 వరకు ఈ అధికారుల బృందం గ్రామంలో పర్యటించనుంది. ఎంఐఈఎస్ బృందంలో తరుణ్‌కుమార్ బన్సాల్, జ్యోతిరాజన్ సాహూ, ఎండీ.అషద్ అన్సారీ, హేమంత్ కుమార్ మీనా, మనోజ్‌కుమార్ ఉన్నారు. వీరు గ్రామంలో 5 రోజులు పర్యటించి గ్రామీణ ప్రాంత స్థితి గతులపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ట్రైనీ అధికారులు 5 రోజులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే బస చేయనున్నారు. వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టారు. మండలంలోని అనేక విషయాలను అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీ ఎంఐఈఎస్ అధికారుల పర్యటనను విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, సర్పంచ్ ఇందిర, ఎంపీవో ఉమారాణి ఉన్నారు.