సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు స్టాప్‌లైన్ దాటితే వాతపెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నేటి (నవంబర్ 1 మంగళవారం) నుంచి కమిషనరేట్ పరిధిలో స్టాప్‌లైన్ వాయిలేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించిన పోలీసులు ఇక నుంచి నిబంధనలు అతిక్రమించేవారిపై కొరడా జులిపించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అన్ని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద స్టాప్‌లైన్ వాయిలేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు.
సిగ్నల్స్ వద్ద స్టాప్‌లైన్ దాటి వాహనాలను ముందుకు ఆపడం వల్ల పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని అంతేకాకుండా ట్రాఫిక్ స్తంభించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే స్టాప్‌లైన్ ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నిబంధనలు పాటించని వారికి రూ.100 జరిమానా విధించనున్నట్లు ఆయన హెచ్చరించారు.
15 రోజుల్లో 10వేల కేసులు
నెలలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక అంశంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మొన్నటి వరకు నంబర్ ప్లేట్ల ఉల్లంఘనపై 15రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ జరిపి 10వేల కేసులు నమోదు చేశాం. ఇందులో తప్పుడు నంబర్ ప్లేట్లు, నంబర్లు సరిగ్గా కనబడకుండా నంబర్ ప్లేట్లను వంచడం, లేదా నంబర్ ప్లేట్లకు మాస్కులు పెట్టడం, అస్పష్టంగా ఉండే నంబర్ ప్లేట్లను కలిగి ఉండటం వంటి వాటిపై కేసులు నమోదు చేశాం. ఉల్లంఘనులకు జరిమానాతో పాటు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నాం. నవంబర్ 1 నుంచి అంటే నేటి నుంచి స్టాప్‌లైన్ ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నాం.
– టి.శ్రీనివాసరావు, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ