ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు హరిప్రియ, అశోక్‌కుమార్
రంగారెడ్డి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై డీఆర్వో అధికారులతో మాట్లాడారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆమె స్వీకరించారు. వివిధ సమస్యలపై 140 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. పింఛన్లకు సంబంధించినవి 11, జిల్లా పౌర సరఫరాలకు 2, మిగతా ఇతర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అమరేందర్ పాల్గొన్నారు.