ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 : సత్వర వైద్య సేవలందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు అత్యంత ఆదరణ లభిస్తున్నది. జలుబు, దగ్గు, జ్వరం, సీటీ స్కాన్, రక్త, మూత్ర పరీక్షలు తదితర సేవలు ఉచితంగా అందుతున్నాయి. ఒక్కో బస్తీ దవాఖానలో ఎంబీబీఎస్ డాక్టర్‌తో పాటు స్టాఫ్‌నర్సు, ఇతర కిందిస్థాయి సిబ్బంది ఉంటున్నారు. ప్రాథమికంగా వైద్య సేవలను అందించి అత్యవసరమైతేనే పెద్ద దవాఖానలకు పంపిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో పాటు ప్రజల అభ్యర్థన మేరకు ఉమ్మడి జిల్లా వైద్యారోగ్యశాఖ కొత్తగా బస్తీ దవాఖానలను విస్తృతపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 37 బస్తీ దవాఖానల్లో వైద్య సేవలందుతుండగా, మరో 22 బస్తీ దవాఖానల ఏర్పాటుకు జిల్లాయంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వికారాబాద్ జిల్లాకు 4 బస్తీ దవాఖానలు మంజూరు కాగా, తాండూరు, వికారాబాద్ దవాఖానల్లో ఉత్తమ సేవలందుతున్నాయి. పరిగి, కొడంగల్‌లో త్వరలో దవాఖానలను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసే బాధ తప్పిందని, బస్తీ దవాఖానలతో ఉచిత వైద్యం, మందులను అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లావాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పేదలకు మరింత వైద్యసదుపాయం అందించడానికి.. ఆర్ఎంపీల బెడదను తొలగించడంతోపాటు ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బస్తీ దవాఖానలను పెద్దఎత్తున ప్రారంభిస్తున్నది. ఈ దవాఖానల్లో సత్వర వైద్యం అందించేందుకు వీలుగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక స్టాఫ్‌నర్సుతో పాటు అటెండర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమికంగా వైద్యసేవలతోపాటు వివిధ రోగాలకు సంబంధించి కౌన్సిలింగ్ద్వారా కూడా మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పెద్దఅంబర్‌పేట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, శంషాబాద్, తుక్కుగూడ, నార్సింగి, హైదర్షాకోట్లా, మణికొండ, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. ప్రజల వినతులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా మరో 22 ఆస్పత్రుల ఏర్పాటుకు, వైద్యులు, స్టాఫ్ నర్సుల కేటాయింపు కోసం జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
జిల్లాలో ప్రస్తుతం 37 బస్తీ దవాఖానలు
రంగారెడ్డిజిల్లాలో ప్రస్తుతం 37 బస్తీ దవాఖానలు పనిచేస్తున్నాయి. ప్రజల వినతులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా మరో 22 ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించాయి. అందుకు సంబంధించిన వైద్యులు, ఇతర సిబ్బందిని కూడా ప్రభుత్వం కేటాయించింది. దీంతో జిల్లాలో అత్యవసరమైన ప్రాంతాల్లో దవాఖానలను ఏర్పాటు చేయడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలతోపాటు అందుబాటులో లేనిచోట ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకునే పనుల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
త్వరలో ప్రారంభం కానున్న ఆస్పత్రులు
జిల్లాలోని శివారు ప్రాంతమైన బాలాపూర్, మణికొండ, శంషాబాద్‌లలో మరోవారం రోజుల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి భవనాల గుర్తింపు, సిబ్బంది కేటాయింపు కూడా పూర్తయిందని తెలిపారు. హైదర్షాకోట్లా, జల్పల్లి మున్సిపాలిటీలోని కొత్తపేట, నార్సింగ్ మున్సిపాలిటీలోని ఖానాపూర్, శంషాబాద్ మున్సిపాలిటీలోని కాపుగడ్డ, మణికొండ మున్సిపాలిటీలోని అల్గాసాగర్లో కూడా ఆస్పత్రుల ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
మరో 14 బస్తీ దవాఖానలకు అనుమతులు
జిల్లాలోని పలు శివారు మున్సిపాలిటీల్లో మరో 14 దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇందులో మణికొండ మున్సిపాలిటీలో4, బండ్లగూడ జాగీర్‌లో 3, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 3, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 2, ఆదిబట్ల మున్సిపాలిటీలో 1, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలో 1 త్వరలో ఏర్పాటు చేసే యోచనలో వైద్యారోగ్యశాఖ అధికారులున్నారు. ఇప్పటికే తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 1, ఆదిబట్ల మున్సిపాలిటీలో 1 ఆస్పత్రులు ప్రారంభమయ్యాయి. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో దీంతోపాటు తుర్కయాంజాల్‌లో మరో 2, ఆదిబట్లలో మరో 1 అదనంగా ప్రారంభించటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బస్తీ దవాఖానల్లో లభిస్తున్న వైద్యసేవలు
బీపీ, షుగర్ వంటి రోగులకు వైద్యసదుపాయాలు అందించడంతో పాటు హెల్త్ ఎడ్యుకేషన్, వివిధ రోగాలపై కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ డాక్టర్‌తో పాటు స్టాఫ్ నర్సు, ఇతర కిందిస్థాయి సిబ్బంది ఉంటున్నారు. దీంతో ఓపీ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది.
మరిన్ని వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తాం
జిల్లాలో ప్రస్తుతమున్న బస్తీ దవాఖానలతోపాటు త్వరలో మరిన్ని కొత్తవాటిని అందుబాటులోకి తేనున్నాం. ఆయా బస్తీల ప్రజల నుంచి వచ్చే వినతులను దృష్టిలో ఉంచుకుని త్వరలో ప్రభుత్వానికి మరిన్ని ప్రతిపాదనలు పంపుతాం. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో మాత్రమే దవాఖానలను ఏర్పాటు చేస్తున్నాం.
– వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్‌వో, రంగారెడ్డిజిల్లా
బస్తీ దవాఖానలతో మంచి వైద్యం
ప్రైవేటు దవాఖానల్లో ఎక్కువ డబ్బులు ఖర్చుచేసి వైద్యం చేయించుకునేవాళ్లం. సర్కారు మా ఇంటి సమీపంలోనే ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానతో సమస్యలన్నీ తొలగిపోయాయి. రూపాయి ఖర్చు లేకుండా మంచి వైద్యం అందిస్తున్నారు.
– సత్యనారాయణ, తుర్కయాంజాల్
రూపాయి ఖర్చు లేకుండా మంచిగ చూస్తుండ్రు
ప్రైవేట్ దవాఖాండ్లకు పోతే వేలకు వేలు గుంజుతుండ్రు. అలాంటి పరిస్థితిల మా బస్తీలో ఏర్పాటు చేసిన దవాఖానతో రూపాయి ఖర్చు లేకుండా సక్కగ సూస్తుండ్రు. బీపీ, జ్వరం, ఏ నొప్పి వచ్చినా పోగానే పరీక్షలు చేసి మంచి మందులు ఇస్తుండ్రు.
– సావిత్రి, తుర్కయాంజాల్
నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం
బస్తీ దవాఖానలకు వచ్చేవారిని వైద్య సిబ్బంది ఓపిగ్గా పరీక్షించి సరైన సేవలు అందించి మందులు అందిస్తున్నారు. ఎమర్జెన్సీ అయితే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి, ఎక్కువ సీరియస్ సమస్యలున్న కేసులను 108లో జిల్లా దవాఖానలకు పంపిస్తున్నాం. నిత్యం 80 నుంచి 100 మంది వివిధ ఆరోగ్య సమస్యలపై సేవలు పొందుతున్నారు. త్వరలో పరిగి, కొడంగల్‌లో బస్తీ దవాఖానలు ప్రారంభిస్తాం. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
ఎంతో ఉపయోగం : సంజీవ్‌కుమార్, పాత తాండూరు
ఈ ప్రాంత ప్రజలకు వైద్యం కావాలంటే రేల్వే గేటు దాటి వెళ్లాల్సి ఉండేది. రైలు వస్తుందంటే 10 నుంచి 20 నిమిషాలు గేటు పడడంతో రోగులకు చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం పాత తాండూరు అంబేద్కర్ పార్కులో బస్తీ దవాఖాన కొనసాగుతుండడంతో ఇక్కడి ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నది. రోజుకు 100 మంది వరకు ఉచిత చికిత్స పొందుతున్నారు. ఇక్కడ దవాఖాన మంజూరు చేయించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు.
– పల్వాన్‌కుమార్, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి