కడ్తాల్, అక్టోబర్ 30 : మండల కేంద్రంలో చిరు వ్యాపారుల కష్టాలు దూరం కానున్నాయి. కడ్తాల్ గ్రామంలో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కల త్వరలో నెరవెరబోతుండటంతో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య నిధులు రూ.48 లక్షలతో చేపట్టిన పది షెటర్లు పూర్తి కావడంతో వ్యాపారం చేసుకోవడానికి అనువైన స్థలం వ్యాపారులకు అందుబాటులోకి రానున్నది. కడ్తాల్ గ్రామం మండల కేంద్రంగా ఏర్పడటంతో దినదినాభివృద్ధి చెందుతున్నది. నిత్యం మండల కేంద్రానికి పరిసర గ్రామాల ప్రజలతో పాటు కందుకూర్ మండలం దాసర్లపల్లి, ముచ్చర్ల, ఉట్లపల్లి, దెబ్బడగూడ గ్రామాలకు చెందిన ప్రజలు వస్తూ పోతుంటారు. మండల కేంద్రంలో వ్యాపారం చేసుకోవడానికి షెటర్లు దొరకని పరిస్థితి నెలకొనడంతో ప్రైవేట్ షెటర్ల యాజమానులు కిరాయిలను అమాంతం పెంచేశారు. దీంతో వ్యాపారం చేసుకోవడానికి పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని వ్యాపారులతో పాటు ప్రజలు కోరారు. గతంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారికి రెండు వైపులా చిన్న డబ్బాలు, షటర్లు వేసుకొని వ్యాపారం చేసుకునేవారు. ఈ రహదారి విస్తరణలో దుకాణాలు కోల్పోయి దాదాపు 50-70 మంది వ్యాపారుల రోడ్డున పడ్డారు. అదే స్థలంలో తోపుడు బండ్లపై వ్యాపారం నిర్వహిస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అప్పటి నుంచి పాల శీతలీకరణ కేంద్రం ఆవరణలో షటర్లు నిర్మించాలని డిమాండ్ మరింత పెరిగింది.
రూ.48 లక్షలతో నిర్మాణం
మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, విజయ డెయిరీ, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు, ప్రజలు పలుమార్లు వినతి పత్రాలు అందజేశారు. దీంతో పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.48 లక్షలు నిధులు విడుదల చేయడంతో.. 2022 జనవరిలో దుకాణ సముదాయ నిర్మాణానికి ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి శంకుస్థాపన చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ పనులు తొమ్మిది నెలల్లో పూర్తి కావడంతో చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులోకి తీసుకొస్తాం
పాలశీతలీకరణ కేంద్రంలో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య సహకరంతో రూ.48 లక్షలతో చేపట్టిన షటర్ల నిర్మాణ జరిగింది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న చిరు వ్యాపారుల కల నెరవెరబోతున్నది. త్వరలో షాపింగ్ కాంప్లెక్స్‌ని ప్రారంభించి నిబంధనల మేరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
–చెన్నకిషన్‌రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్