సెల్‌ఫోన్ రిపేర్లతో యువతకు ఉపాధి
సాంకేతికతతో ఆర్థికాభివృద్ధి
ఆమనగల్లు, మార్చి18 : మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను యువత అందిపుచ్చుకొంటున్నారు. తమలో ఉన్న నైపుణ్యమే పెట్టుబడిగా పెట్టి మొబైల్ రంగంలో ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకొని ఉపాధిపొందుతూ పలువురికి ఈ రంగంలో ఉపాధి కల్పిస్తున్నారు. మొబైల్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా పెరిగిపోయాయి. టెక్నాలజీలో విభిన్న మార్పులు రావడంతో తక్కువ ధరలోనే వివిధ కంపెనీలు నాణ్యతతో కూడిన సెల్ఫోన్లను మార్కెట్లలో విడుదల చేస్తున్నాయి. ఆయా మొబైల్లో నూతన సాంకేతికత రూపుదిద్దుకోవడంతో ఆయా కంపెనీలకు సంబంధించిన మొబైల్‌ను రిపేర్చేస్తూ యువత అవకాశాలను ఆర్థికంగా మలుచుకొంటున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితం అయిన రిపేర్ల దుకాణాలు నేడు గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా తమ రిపేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఉపాధి పొందుతున్న యువత..
మొబైల్ రిపేర్ సెంటర్లు ఏర్పాటు చేసుకొన్న పలువురు యువత ప్రస్తుతం మంచి ఆదాయ వనరులు సంపాదించుకొంటున్నారు. మొబైల్ రంగంలో స్థిరపడినవారంతా ప్రస్తుతం తమతో పాటు గా పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ప్రభుత్వంతో పాటు, స్వచ్ఛంద సంస్థల వారు సైతం యువతకు మొబైల్ రంగంలో ప్రత్యేక ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. మొబైల్ రంగంలో శిక్షణ పొందిన వారూ ఆర్థికంగా వృద్ధిలోకి వస్తుండంతో యువత మొబైల్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో పలువురు యువత ప్రస్తుతం మొబైల్ దుకాణాలు, రిపేర్సెంటర్లను ఏర్పాటు చేసుకొని స్వయం కృషితో ఎదుగుతున్నారు.
స్వయంగా ఎదుగొచ్చు
సెల్‌ఫోన్ రిపేర్‌లో మంచి నైపుణ్యంతో పాటు గా ఓపిక ఉండాలి. నేను పెద్దగా చదువుకోలేదు. మెకానిజంపై ఉన్న ఇష్టంతో మిత్రుల సహకారంతో రిపేర్ రంగంలోకి వచ్చాను. పదేండ్లుగా సెల్ఫోన్లను రిపేర్ చేస్తూ భార్యబిడ్డలను పోషించుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాను. మొబైల్రంగంలోకి వచ్చే ఫోన్లపై అవగాహన కలిగి ఉండాలి. సాంకేతికతపై మరింత పట్టుసాధిస్తే సులువుగా రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు.
– శరత్, సెల్‌ఫోన్ టెక్నిషీయన్, ఆమనగల్లు
టెక్నాలజీపై అవగాహన ఉండాలి
నూతన సాంకేతికత అందుబాటులోకి రావడంతో వివిధ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకొనేలా తమ మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నది. మొబైల్ రిపేర్ చేసేవారంతా వినియోగదాడికి సులభంగా సేవలు అందించాలంటే కొత్తటెక్నాలజీపై అవగాహన పెంచుకొంటేనే ఉపాధి దొరుకుతుంది. ప్రతిరోజూ మొబైల్లో వస్తున్న సాంకేతికతను గుర్తించాలి. అప్పుడే కస్టమర్‌కు సర్వీస్ చేయగల్గుతాం. టెక్నాలజీని పట్టుకోకపోతే టెక్నిషీయన్‌గా రాణించలేం.
– పాలాదీ రవికుమార్, ఆమనగల్లు
ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలి..
నేను 15 ఏండ్లనుంచి మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాను. యువత స్వయం ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారిస్తే ఆర్థికంగా స్థిరపడొచ్చు. ప్రభుత్వం కూడా స్వయం ఉపాధి రంగాల్లో యువతకు మంచి స్కిల్స్‌ను నేర్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రత్యేకంగా ప్రభుత్వం స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారిని గుర్తించి వారికి సబ్సిడీ కింద రుణాలు ఇస్తే మేము నలుగురికి ఉపాధి కల్పిస్తాం.
– గంజి యాదగరి, మొబైల్ నిర్వాహకుడు, ఆమనగల్లు