పెద్దేముల్, అక్టోబర్ 29: లంపీస్కిన్ (ముద్ద చర్మవ్యాధి) ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ఇది మనుషులకు సోకదని వికారాబాద్ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని పాషాపూర్ గ్రామంలో లంపీస్కిన్ వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించి.. పశువులకు
వ్యాధి నివారణ టీకాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో పూడూరు, వికారాబాద్, పరిగి, మర్పల్లి, నవాబుపేట, ధారూరు, దౌల్తాబాద్, పెద్దేముల్, చౌడాపూర్లలో సుమారు 38 గ్రా మాల్లో 78 పశువులకు లంపీస్కిన్ సోకగా ఎక్కడ కూడా పశువులు మృతి చెందలేద న్నారు. గత మూడు, నాలుగు రోజులుగా పశువులు, గేదెలకు ముందస్తుగా వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 54 బృందాలతో రైతులకు అవగాహన కల్పిస్తూ 55,685 డోసుల వ్యాక్సిన్‌ను పం పిణీ చేశామని ఆయన చెప్పారు. వ్యాధి లక్షణాల్లో భాగంగా పశువులకు జ్వరం, పాలు తగ్గడం, ముక్కు, కంటి నుంచి ద్రవాలు వస్తాయని.. ఈ వ్యాధి పశువుల్లో ఒకదాని నుంచి మరోదానికి వ్యాపిస్తుందని.. వ్యాధి బారిన పడ్డ పశువును కుట్టిన దోమలు, ఈగలు, గోమార్లు వేరే పశువును ఆశ్రయిస్తే వ్యాధి వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన పశువును వేరుగా కట్టేయాలి. పశువుల పాకను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాకు కావాల్సిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాషాపూర్ సర్పంచ్ భరత్‌కుమార్, పశువైద్యాధికారి డాక్టర్ వెంకట్రాజు, సిబ్బంది సిద్ధిఖ్, ఎల్డీఎం మేనేజర్ రాంబాబు, గ్రామ రైతులు పాల్గొన్నారు.