తాండూరు రూరల్, అక్టోబర్ 28: జినుగుర్తి -తట్టేపల్లి బీటీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాండూరు మండలం జినుగుర్తి గేట్ నుంచి పెద్దేముల్ మండలం తట్టే పల్లి వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. వర్షాల కారణంగా రోడ్డు పనులకు కొంత ఆటంకం ఏర్పడింది. ఈ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొద ట రూ.18 కోట్లు మంజూరు చేసింది. అయితే సింగిల్ రోడ్డు కాకుండా డబుల్ రోడ్డు వేయాలని పలు గ్రామాల నుంచి డిమాండ్ రావడంతో, రోడ్డు పనులను మార్పు చేశారు. దీంతో అదనంగా మరో రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం రూ.23 కోట్లు మంజూరు చేసింది. జినుగుర్తి గేట్ నుంచి తట్టేపల్లి వరకు ఉండే 22 కిలో మీటర్ల రోడ్డు డబుల్ రోడ్డుగా మారనుంది.
ప్రస్తుతం తాండూరు మండల పరిధిలోని జినుగుర్తి గేట్ నుంచి జినుగుర్తితండా వరకు కంకర పనులు పూర్తయ్యాయి. జినుగుర్తితండా నుంచి తట్టేపల్లి వరకు కూడా మట్టి పనులు వేగంగా చేపట్టారు. మరో నాలుగు నెలల్లో ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు. జినుగుర్తి – తట్టేపల్లి బీటీ రోడ్డు పూర్తయితే తాండూరు మండలంతోపాటు పెద్దేముల్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. తాండూరు మండల పరిధిలో జినుగుర్తి, జినుగుర్తితండా, గుండ్లమడుగుతండా, ఉద్దండాపూర్, సంకిరెడ్డిపల్లి, సంకిరెడిపల్లితండాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి గ్రామంలో పలుతండాలకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాకుండా ఈ మార్గం గుండా బండ మీదిపల్లి, బొపనారం, తొరమామిడి గ్రామాలతోపాటు కర్ణాటక సరిహద్దులోని కుంచవరం గ్రామాలకు కూడా సౌకర్యంగా ఉంటుంది.