షాబాద్, మార్చి 17: రాష్ట్రంలో వైద్య, విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని 27వ వార్డులో రూ. 7.40కోట్లతో నిర్మించే 60లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ రిజర్వాయర్, పైప్‌లైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డిజిల్లాలోని శివారు పట్టణాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1200 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి రూ. 207కోట్లు మంజూరు చేయగా, అందులో జల్పల్లి మున్సిపాలిటీకి రూ. 72కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వరదనీరు సాఫీగా వెళ్లటానికి నాలాల అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయింపు, జల్పల్లి మున్సిపాలిటీకి రూ. 10కోట్లతో పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. పేదలందరికీ వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జల్పల్లి మున్సిపాలిటీకి 4 బస్తీ దవఖానాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పహడీషరీఫ్, కొత్తపేట, శ్రీరామ్‌కాలనీ, షాహిన్నగర్ల్లో వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఇందులో వ్యాక్సిన్‌తో పాటు అన్ని రకాల వైద్యసేవలు అందుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 288 బస్తీ దవాఖానల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తెలిపారు. వాటితో పాటు పల్లె దవాఖానల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు, ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైద్య, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. కార్పొరేట్‌కు దీటుగా, నూతన హంగులు సమకూరుస్తూ బడుల రూపురేఖలు మార్చటానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జల్పల్లి పురపాలక సంఘం చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వాటర్ వర్క్స్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు, జల్పల్లి మున్సిపాలిటీల్లో నాలాలకు సంబంధించి రక్షణ చర్యలు, అభివృద్ధి పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంతో శాశ్వతంగా ఉపశమనం లభించాలని అధికారులకు సూచించారు. గురువారం తన కార్యాలయంలో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం(ఎన్ఎస్ఓపీ)పై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో నాలాలపై ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నాలాలపై దురదృష్టకరమైన ఘటనలు జరిగితే అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గంలో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరితే నగర పరిసరాల్లోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నాలా బలోపేతం, ఫెన్సింగ్, అభివృద్ధి చర్యలు చేపట్టాలని పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారని మంత్రి గుర్తు చేశారు. నియోజకవర్గంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లలో 7 పనులకు రూ. 64కోట్లు, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 పనులకు రూ. 18.19కోట్లు, జల్పల్లి మున్సిపాలిటీకి 2 పనులకు సంబంధించి రూ. 24కోట్లు మంత్రి కేటీఆర్ మంజూరు చేశారన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రజలు వరద ముంపుకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అధికారులు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వస్తే మరిన్ని నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజనీర్ కిషన్, సూపరింటెండెంట్ ఇంజినీర్ భాస్కర్‌రెడ్డి, కృష్ణారావు, మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు కృష్ణమోహన్‌రెడ్డి, నాగేశ్వర్రావు, ఇంజినీరింగ్ అధికారులు గోపినాథ్, అశోక్‌రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.