రంగారెడ్డి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో దళితబంధు పథకానికి సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాకు దళితబంధు కింద ఇప్పటికే రూ.17 కోట్ల మేర నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి విడుదలైన నిధుల వరకు గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టేందుకు నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి ఆయా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి నియోజకవర్గానికి 20 యూనిట్ల చొప్పున గ్రౌండింగ్ చేపట్టనున్నారు. జిల్లాలోని షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గంలో 20 యూనిట్ల చొప్పున 160 యూనిట్లకు సంబంధించి వారంలోగా గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాకు అవసరమయ్యే మిగతా రూ.51.90కోట్ల నిధులు కూడా వారం, పది రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసే అవకాశమున్నందున, తదనంతరం మిగతా యూనిట్లకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను చేపట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. అదేవిధంగా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 689 మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. జిల్లాలో షాద్‌నగర్ నియోజకవర్గంలో 100 మంది, మహేశ్వరంలో 100, చేవెళ్ల నియోజకవర్గంలో 82, ఇబ్రహీంపట్నంలో 100 మంది, ఎల్బీనగర్లో 81మంది, కల్వకుర్తి నియోజకవర్గంలో 63, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 100 మంది, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 72 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
యూనిట్ల గ్రౌండింగ్‌కు ఆర్డర్లు..
జిల్లాలో దళితబంధు కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి త్వరితగతిన గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నియోజకవర్గానికి 20 యూనిట్ల చొప్పున గ్రౌండింగ్ చేసేందుకు నిర్ణయించిన దృష్ట్యా ఎంపిక చేసుకున్న యూనిట్లను సమకూర్చేందుకుగాను జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నియోజకవర్గానికి 20 మంది లబ్ధిదారులకు సంబంధించి గ్రౌండింగ్ చేపట్టనున్న దృష్ట్యా కలెక్టర్ బ్యాంకు ఖాతా నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేయనున్నారు. జిల్లాలో అధికంగా ట్రాక్టర్లు, మినీ డైయిరీలతోపాటు కారులకు సంబంధించిన యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. దళితుబంధు పథకంలో భాగంగా ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, పరిశీలన, బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ పూర్తికావడంతోపాటు యూనిట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తైంది. దళితబంధు పథకంలో భాగంగా తొలి విడుతలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇవ్వనున్నది.
యూనిట్స్ ఎంపికలో ఎంపికైన సంబంధిత లబ్ధిదారులు నచ్చిన యూనిట్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మరోవైపు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌కు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించింది. లబ్ధిదారుడు ఇటుక బట్టీ తయారీ స్కీంను ఎంపిక చేసుకున్నట్లయితే సంబంధిత యూనిట్‌కు ఎంత ఖర్చు కానుంది, మెటీరియల్‌కు ఎంత ఖర్చు కానుంది, ఖర్చులుపోను ఎంత లాభం రానుంది ఈ విధంగా తదితర వివరాలన్నింటినీ అవగాహన క్యాంపుల్లో నిపుణులతోపాటు అధికారులు వివరించారు. మరోవైపు లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.10 లక్షల యూనిట్లో రూ.10 వేలతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. వ్యాపారంలోగాని ఇతరత్రా ఏదైనా కష్టమొచ్చినప్పుడు రక్షణ నిధిలోని డబ్బులతో లబ్ధిదారులను ఆదుకునేందుకుగాను రక్షణ నిధి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టాం..
జిల్లాలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు యూనిట్ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన దృష్ట్యా గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టాం. ఇప్పటికే జిల్లాకు విడుదలైన రూ.17 కోట్ల నిధులతో నియోజకవర్గానికి 20 యూనిట్లకు గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టాం. మిగతా నిధులు విడుదలైన వెంటనే మిగతా యూనిట్లకు గ్రౌండింగ్ ప్రక్రియ చేపడుతాం. యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లనే ఫైనల్ చేశాం. వారు భవిష్యత్‌లో నష్టపోకుండా ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి నిపుణులతో పూర్తి అవగాహన కల్పించాం.
– ప్రవీణ్‌రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ