యాచారం, మార్చి 17 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం పనితీరు బేషుగ్గా ఉందని కేంద్ర బృందం సభ్యులు కితాబిచ్చారు. మండలంలోని గున్గల్ గ్రామంలో జల నిలయం కార్యక్రమం ద్వారా గ్రామంలో సర్వే నిర్వహించారు. గ్రామంలో ప్రధానంగా నీటి సరఫరాపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్మించిన ట్యాంకులు, ఇంటింటి నల్లాలను పరిశీలించారు. నీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడిపై అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా ఉందని గ్రామస్తులు తెలపడంతో కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. గున్గల్ కృష్ణా రిజర్వాయర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పలు సమస్యలు, అభివృద్ధిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు రమేశ్, మని, రమేశ్ మాట్లాడుతూ.. గ్రామంలో మిషన్ భగీరథ పథకం పనితీరు ఎంతో బాగుందన్నారు. పథకం ద్వారా ఊరంతా ఇంటికో నల్లాను ఏర్పాటు చేయడం హర్షణీయం, అభినందనీయమన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయడం బాగుందన్నారు. నీటిని పొదుపుగా వాడాలని వారు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాశమల్ల ఇందిర శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.