రంగారెడ్డి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆహార భద్రత, నిల్వలు, జాగ్రత్త చర్యలపై జిల్లా ప్రజలు పలు సూచనలు, సలహాలు ఇవ్వాలని రంగారెడ్డి డీఈవో సుశీందర్‌రావు సోమవారం కోరారు. జాతీయ ఆహార భద్రతాచట్టం-2013 ప్రకారం, రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీలోగా ఆన్లైన్లో తెలంగాణ ఆహార భద్రత కమిషన్ కార్యాలయానికి జిల్లా ప్రజలు పలు సూచనలు, సలహాలను అందించొచ్చన్నారు.
జిల్లాలోని సాధారణ పౌరులు, అధికారులు, కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్న అధికారులు, లబ్ధిదారులు, ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఆహార భద్రత, పౌష్టికాహారం అంటే ఏమిటి? ఇప్పటివరకు ఈ అంశంపై జరిగిన అధ్యయనాలపై, జాతీయ ఆహార భద్రతాచట్టంపై ప్రజలు, అధికారులకు అవగాహన, దాని అమలు పై, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సూచికల్లో జరిగే మార్పులు, అదే విధంగా ఆ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? చట్టంలో లబ్ధిదారులు ఎవరు? వారి హక్కులు, బాధ్యతలు ఏమిటి? వివిధ స్థాయిల్లో ఆ చట్టాన్ని అమలుపరిచేది ఎవరు..? తెలిపై విధంగా కార్యక్రమం ఉంటున్నదని తెలిపారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజన పథకం అమలు, కేసీఆర్ కిట్లు, వాటి అమల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కార మార్గాలు, తదితర అంశాలతోపాటు 1000 నుంచి 3000 పదాలకు మించకుండా సమగ్రమైన నోట్స్ రూపంలో రాసి పీడీఎఫ్‌గా ఈ నెల 12వ తేదీలోపు పంపాలని డీఈవో సూచించారు. ఉత్తమ ప్రవేశాలకు జ్ఞాపికతోపాటు ప్రత్యేక ప్రశంసలు ఉంటాయన్నారు. పీడీఎఫ్, పీపీటీలు tsfetelanganastate2017@ gmail.comకు మెయిల్ చేయాలన్నారు.