పల్లె ప్రగతికి ముందు ఖాజాఅహ్మద్పల్లి గ్రామం అంతా మురుగుమయంగా ఉండేది. ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిచ్చేవి. దోమ కాటుకు చాలా మంది అనారోగ్యానికి గురి కావలసి వచ్చేది. తాగునీటి కోసం తిప్పలు పడేవారు. ఏ పని చేద్దామన్నా నిధులు మంజూరయ్యేవికావు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతితో నేడు గ్రామం స్వచ్ఛతను సంతరించుకున్నది. ప్రతిరోజూ చెత్త సేకరణ చేస్తున్నారు. చూద్దామన్నా చెత్త అగుపించడంలేదు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. ఏపుగా పెరిగిన మొక్కలతో గ్రామమంతా పచ్చదనం నెలకొంది. రోడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు కావలసిన సౌకర్యాలను సీఎం కేసీఆర్ గుర్తెరిగి సరిపడా నిధులు మంజూరు చేస్తున్నారు.
కొడంగల్ మండలంలోని ఖాజాఅహ్మద్పల్లి గతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మురుగు, ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు అన్నట్లుగా ఉండేది. పల్లె ప్రగతి కార్యక్రమంతో చెత్త కుప్పలు, మురికి కుంటలు మాయమై గ్రామంలోని రోడ్లు స్వచ్ఛతను సంతరించుకున్నాయి. హరితహారంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చల్లటి నీడతో పాటు చక్కటి గాలిని అందిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామంతోపాటు వీధుల్లో సీసీ రోడ్లను నిర్మించారు. నియోజకవర్గంలో ఖాజాఅహ్మద్పల్లిలోని పల్లె ప్రకృతి వనం ప్రప్రథమంగా నిర్మాణం కాగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధతో ప్రకృతి వనంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి.
ప్రతి నెల గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో గ్రామంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం కింద నల్లా కనెక్షన్లు పూర్తి కావడంతో ఇంటి ముందుకు స్వచ్ఛమైన కృష్ణాజలాలు రావడంపై మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ కాలమైనా తాగునీటికి కరువు లేదని.. అప్పట్లో ఖాళీ బిందెలు పట్టుకొని పొలాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. ఇంటి పక్కనే చెత్తకుప్పలు ఉండటంతో దుర్వాసన ఉండేదని, దోమకాటుతో అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు.
నేడు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ప్రతిరోజూ ఇంటి ముందుకు వచ్చి చెత్తను సేకరించడంతో దోమలు, దుర్వాసన దూరమైనట్లు తెలిపారు. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుతో గ్రామం వెలుగొందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంపై శ్రద్ధ ఉన్న నాయకుడే ఇటువంటి అభివృద్ధికి సహకరిస్తారని సీఎం కేసీఆర్ను అభినందిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామానికి ఎటువంటి నిధులు అందేవికావని.. తద్వారా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయినట్లు ప్రజలు పేర్కొంటున్నారు.
పచ్చదనం ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ ఆరోగ్యం నెలకొని ఉంటుందని సీఎం కేసీఆర్ పచ్చదనానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి గ్రామాలకు పచ్చదనాన్ని అందించారు. చెట్లు చల్లటి నీడ, చక్కటి గాలిని అందిస్తున్నాయి. ఆలయాలకు సమీపంలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశాం.
– బాబు, ఖాజాఅహ్మద్పల్లి, కొడంగల్
ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామం త్వరితగతిన అభివృద్ధికి బాటలు వేసుకొంది. గ్రామాభివృద్ధికి సంబంధించి కోరిన వెంటనే నిధులు అందించి, పనుల నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడంతో ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సీసీ రోడ్లతో గ్రామంలో స్వచ్ఛత, ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి నల్లా కనెక్షన్లతో నీటి సమస్య తొలగింది. ప్రతి రోజూ గ్రామంలో చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తుండటం వల్ల చెత్తకుప్పలు మాయమయ్యాయి. స్వచ్ఛతపై గ్రామస్తులకు అవగాహన ఏర్పడి తద్వారా గ్రామంలో స్వచ్ఛత నెలకొంది.
– అంజప్ప, సర్పంచ్, ఖాజాఅహ్మద్పల్లి, కొడంగల్
గ్రామాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించడం వల్ల అభివృద్ధి సాధ్యపడింది. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామంలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. ప్రతి రోజూ పంచాయతీ సిబ్బందితో శుభ్రత చేపడుతున్నాం. గ్రామంలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అప్పట్లో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. గ్రామం అంతటా పచ్చదనం పరుచుకుంది.
– వరుణ్, పంచాయతీ కార్యదర్శి, ఖాజాఅహ్మద్పల్లి, కొడంగల్