ఇబ్రహీంపట్నం, జూలై 26: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. దీంతో పలు గ్రామాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలానికి ఎగువన కందుకూరు మండలంలోని ఆకులమైలారం, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరదనీరు పెద్ద వాగు నుంచి ఇబ్రహీంపట్నం చెరువుకు చేరుతున్నది.
పెద్దవాగులో ఇటీవల నిర్మించిన చెక్‌డ్యాంలు పూర్తిగా నిండి ఇబ్రహీంపట్నం చెరువుకు వరదనీరు చేరింది. అలాగే రాచ కాల్వ నుంచి కూడా వరద వస్తుండటంతో ఇబ్రహీంపట్నం చెరువులో నీటి మట్టం గణనీయంగా పెరుగుతున్నది. ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖాన, శేరిగూడ చెక్‌డ్యాం నిండుకుండలా మారుతున్నాయి.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు లోతట్టు కాలనీల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లు నేలకూలాయి. బుధవారం కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
షాబాద్ : షాబాద్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి కురిసిన భారీ వర్షానికి నాగరగూడ ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. షాబాద్ పహిల్వాన్ చెరువు నిండటంతో అలుగు పారుతుంది.
మండలంలోని చర్లగూడ, బొబ్బిలిగామ, కుమ్మరిగూడ, నరెడ్లగూడ, తిమ్మారెడ్డిగూడ, మక్తగూడ, రుద్రారం, చందనవెళ్లి, బోడంపహాడ్ తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పారుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ముసురుతో కూడిన వర్షం కురిసింది. కురుస్తున్న వర్షానికి ప్రజలు బయటకు రాకుండా ఇండ్లకే పరిమితమయ్యారు. పలుకాలనీ వీధులు బురదమయంగా మారాయి. నివాసాల మధ్య వర్షపు నీళ్లు నిలిచాయి.
కేశంపేట : వివిధ గ్రామాల్లో సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరింది. ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షాలకు అల్వాల, కేశంపేట, పాటిగడ్డ గ్రామాల మీదుగా వాగు సాగడంతో చెక్‌డ్యాంలు నిండి అలుగులు పారాయి. చెరువులకు జల కళ సంతరించుకుంది.
పొంగుతున్న వాగులు
నందిగామ : నందిగామ, కొత్తూరు మండలాల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వివిధ గ్రామాల్లోని వాగులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.
పెద్దఅంబర్‌పేట : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పసుమాములలోని కళానగర్లోకి నీళ్లు చేరాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు వీధుల్లోని ఇండ్లలోకి కూడా నీళ్లు చేరాయి. మంగళవారం ఉదయం ఇరిగేషన్ ఎస్ఈ ఖాన్, డిప్యూటీ ఇంజినీర్ ఉషారాణి, కమిషనర్ రామాంజులరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, కౌన్సిలర్ మోతె మణెమ్మ, ఇతర అధికారులు కళానగర్‌లో పర్యటించారు. ముంపునకు గల కారణాలను విశ్లేషించారు. వారి వెంట డీఈఈ అశోక్‌కుమార్, నాయకులు చిరంజీవి తదితరులు ఉన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. అయ్యవారిపల్లి గ్రామ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో చించోడు గ్రామం నుంచి అయ్యవారిపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుడటంతో సీఐ నవీన్‌కుమార్ వాగును పరిశీలించారు. పోలీసుల బందోబస్తు నియమించారు.
శంకర్పల్లి : భారీ వర్షాలకు శంకర్పల్లి మున్సిపాలిటీ, మండలంలోని పత్తేపూర్, ప్రొద్దటూర్ గ్రామాల పరిధిలో మూసి వాగు పొంగిపొర్లుతున్నది. మంగళవారం మండలంలోని ప్రొద్దటూర్ గ్రా మంలో గల మూసి వాగును ఐదుగురు దాటుతుండగా ప్రమాద వశాత్తు వాగులో చిక్కుకున్నారు. శంకర్పల్లి సీఐ మహేశ్‌గౌడ్, ఎస్ఐలు కృష్ణ, సంతోష్‌లు జేసీబీ సాయంతో రక్షించారు.
కడ్తాల్ : మండల వ్యాప్తంగా మంగళవారం తెల్లవారు జాము న భారీ వర్షం కురిసింది. తెల్లవారు జామున రెండు గంటలపాటు భారీ వర్షం, మధ్యాహ్నం మోస్త్తరు వాన కురిసింది. వానలకు మండలంలోని చెరువులు, కుంటలు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
చేవెళ్లటౌన్: ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి తేకుండా భారీ వర్షం కురబంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో పాటు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నీట మునిగిన ఇండ్లలోని పరిస్థితిని సర్పంచ్ బండారి శైలజ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కుమార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
సింగప్ప గూడ గ్రామ సమీపంలోని వాగు పొంగిపొర్లడంతో ఆ గ్రామస్తులకు రాకపోకలు నిలిచిపోయ్యాయి. సింగప్ప గూడ గ్రామం మీదిగా హుస్సేన్ పూర్, కొత్తపల్లి, మాసానిగూడ, పర్వేద, సంకెపల్లి గ్రామాలవకు వెళ్లేవారితో పాటు సింగప్పగూడ గ్రామ రైతుల పొలాలు వాగు అవతల ఉండటంతో పొలాలకు వెళ్లిన రైతులు సైతం వాగు రావడంతో అక్కడే నిలిచి ఉండిపోయారు.
చేవెళ్ల రూరల్ : వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మండల పరిధిలోని పలు ప్రధాన వాగులు వరద ఉధృతితో ఉప్పొంగుతున్నాయి. మంగళవారం దేవునిఎర్రవల్లి, తంగడిపల్లి టు అంతప్పగూడ, కుమ్మెర, అంతారం, కౌకుంట్ల, ఆలూరు, పామెన, దేవరంపల్లి తదితర ప్రధాన వాగుల్లోకి వరద ఉధృతి చేరి పొంగి పొర్లాయి. వివిధ వాగులను ఎంపీడీవో రాజ్‌కుమార్, తహసీల్దార్ వైఎస్.శ్రీనివాస్, ఆర్ఐ రాజేశ్ పరిశీలించారు.